వైసీపీ నేతలు ప్రాంతీయ ఉద్యమాల్లో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం కోసం ధర్మాన ప్రసాదరావు రెడీ అయిపోయారు. అమరావతినే రాజధాని చంద్రబాబు అంటున్నారని.. అలా అయితే మా విశాఖను మాకిచ్చేయాలని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటామని ఆయన ప్రకటించేశారు. ఎచ్చెర్లలో వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబు ఇటీవలి పర్యటనలో.. ఒకే రాజధాని అమరావతి ఉండాలని ప్రజలతో నినాదాలు చేయించిన అంశాన్ని గుర్తు చేసుకుని ఆవేశపడ్డారు.
ఉత్తరాంధ్రలో తిరుగుతూ అమరావతి రాజధాని అని చంద్రబాబు తిరగడం మన చేతులతో మన కళ్ళు ని పొడిచె ప్రయత్నం చేశారని అన్నారు. చంద్రబాబు అమరావతి రాజధాని అని చెబుతున్నాడు అదే జరిగితే మాకు విశాఖ రాజధాని ఇచ్చేయండి మేము ఒక చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటామన్నారు. జనాల్లో ఇంకా ఎక్కడో సైకిల్ భావన ఉంది , ఇంకా సైకిల్ ని నమ్మి మోసపోకండని సలహా ఇచ్చారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తాడని.. ముసలివాడు అయిన మొన్న కారుమీద ఎక్కి డాన్స్ చేశాడని విమర్శించారు.
ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయానికి ధర్మాన ఏ మాత్రం వెనుకాడటం లేదు. నిజానికి ధర్మాన అమరావతిని హార్డ్ కోర్ గా సపోర్ట్ చేశారు. ఆ వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మూడు రాజధానుల విధానం తీసుకున్న తర్వాత ఆయన విశ్వరూపం చూపిస్తున్నారు. సిట్ రిపోర్టుల్లో ఆయన పేరు ఉండటంతో మరింతగా విజృంభిస్తున్నారు. ఆయన డిమాండ్‌కు ప్రజలు ఎంత మేర మద్దతు తెలుపుతారో వేచి చూడాల్సి ఉంది.