” చంద్రబాబు అధికారంలోకి వస్తే మొట్టమొదటి ఫైరింగ్ వాలంటీర్లపై ఉంటుంది. చంద్రబాబు కన్నా ముందే మనమే పేల్చేస్తే సరి. ఇప్పుడు మన దగ్గర తుపాకీ ఉంది. టీవీ, పేపర్లు చూసి ఏదో జరుగుతుందని అనుకోకండి…” అని మంత్రి ధర్మాన ప్రసాదరావు వాలంటీర్లకు హితవు పలికిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. మంత్రి అయినప్పటికీ ఆయన అధికార విధుల్లో పాల్గొన్నది తక్కువ. నియోజకవర్గంలో గడప గడపకూ తిరుగుతూ…వైసీపీ పరిస్థితి బాగో లేదని బయటకు తెలిసేలా విచిత్రమైన కామెంట్లు చేస్తూ ఉంటారు.
తాజాగా సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లతో జరిగిన భేటీలో ప్రజలు అమాయకత్వంగా ప్రతిపక్ష పార్టీలు చెప్పిన మాటలు నమ్మేస్తారు…వాళ్లను వాలంటీర్లు ఎడ్యుకేట్ చేయాలని సూచించారు. ఓ మంచి ప్రభుత్వం గురించి చెప్పే హక్కు వాలంటీర్లకు ఉంటుంది. మీరు భయపడకండి. ప్రతి వాలంటీర్ వారికి కేటాయించిన 50 కుటుంబాలతో మాట్లాడండి. వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేయాలని చెప్పాలని సూచించారు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఏదో ఒకటి చేస్తారని.. ఆయన చేయడానికి ముందే మనం చేయాలని వాలంటీర్లకు చెప్పుకొచ్చారు.
ధరలు అన్ని దేశాల్లో పెరిగాయని, ప్రతిపక్షాల ఆరోపిస్తున్నట్లు ఏపీలో మాత్రమే ధరలు పెరగలేదని చెప్పుకొచ్చారు. ప్రజలు మధ్యలో పాలన జీవితం వేరు సినిమా యాక్షన్ వేరని పవన్ కల్యాణ్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు ఉన్నారన్నారు. సన్నిహిత సంబంధాలను ఉపయోగించి వాలంటీర్లు ఏ మంచి జరుగుతుందో ప్రజలకు తెలియజెప్పాలన్నారు. మొత్తంగా వాలంటీర్ల చేతిలో తమ గెలుపోటములు ఉన్నట్లుగా ధర్మన చేతులెత్తేసిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.