ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు ధోనీ. ఐపీఎల్ లో తప్ప, ధోనీ ఇంకెక్కడా కనిపించే అవకాశం లేదు. ఈ యేడాది ఐపీఎల్ లో చెన్నై ప్రస్థానం ఈరోజుతో ముగిసిపోయింది. ఈ ఐపీఎల్ తో చెన్నై సూపర్ కింగ్స్‌కీ ధోనీ గుడ్ బై చెబుతాడని, ఈరోజు పంజాబ్ తో జరిగే మ్యాచ్… ధోనీకి చివరి మ్యాచ్ అవుతుందనుకున్నారంతా. అయితే… ధోనీ మాత్రం `అలాంటిదేం లేదు` అనితేల్చేశాడు. ఈరోజు టాస్ సందర్భంగా `చెన్నై తరపున ఆడే చివరి మ్యాచ్ ఇదేనా` అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. `లేదు` అని సమాధానం ఇచ్చాడు. అంటే.. 2021 ఐపీఎల్ లోనూ.. ధోనీ ఆడతాడన్నమాట.
అయితే.. ధోనీ వయసు, శరీరం అందుకు సహకరిస్తుందా అన్నది ప్రశ్న. వచ్చే యేడాది వరకూ క్రికెట్ ఆడకుండా, నేరుగా ఐపీఎల్ లో దిగాలనుకోవడవం అత్యాస లాంటిదే. పైగా ధోనీ వయసు నలభై పైబడింది. తన ఫామ్ అంతంత మాత్రమే. పైగా ఫిట్ నెస్ సమస్యలూ మొదలయ్యాయి. ఈ ఫిట్ నెస్‌తో 2021 ఐపీఎల్ ఆడడం దాదాపు అసాధ్యం. కానీ.. ధోనీ ఎప్పుడూ అసాధ్యాలను సుసాధ్యం చేయాలనుకునే ఆటగాడు. వచ్చే ఐపీఎల్ కీ అందుబాటులో ఉంటానని ప్రకటించడం చెన్నై ఫ్రాంచైజీకే కాదు. ధోనీ అభిమానులకూ గొప్ప వార్తే.