కర్నూలు జిల్లాలో వర్షాలు పడితే పొలాల్లో ప్రజలు వజ్రాల వేట చేస్తూంటారని మనం చూస్తూంటాం. రంగురాళ్లు దొరికితే లక్షాధికారులు అయిపోయిన వారి కథలు విన్నాం. ఇక నుంచి కడప జిల్లాలో కథలు వినాల్సి ఉంటుంది. ఎందుకంటే కడప జిల్లాలో వజ్రాల గనులు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్ని.. ఏమేమి ఖనిజాలు ఉన్నాయో గుర్తించేందుకు ప్రత్యేమైన పరిశోధన చేసిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏపీలో ఉన్న వాటిని కూడా గుర్తించారు.
కడప జిల్లా ఉప్పరపల్లె ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్ల పరిధిలో వజ్రాలు ఉన్నట్లుగా తేల్చారు. అలాగే శ్రీకాకుళం జిల్లా ములగపాడు, విశాఖపట్నం జిల్లా నందా, విజయనగరం జిల్లా గరికపేట, శివన్నదొర వలస , బుద్ధరాయవలస మాంగనీస్ బ్లాక్లు ఉన్నాయని గుర్తించారు. అలాగే ప్రకాశం జిల్లా 2 ఐరన్ ఓర్ బ్లాక్లను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ సర్వే చేయడానికి ప్రధాన కారణం మైనింగ్ లీజులు ఇవ్వడమే. ఇప్పుడు ఈ గనులను లీజులకు ఇస్తారు. అయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వే ప్రకారం ముందుగా లీజులు తీసుకున్న వారు వెంటనే మైనింగ్ చేయకూడదు. ఆ బ్లాకుల్లో ఖనిజం ఎక్కడ, ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి సొంతంగా సర్వేలు చేయించుకోవాలి.ఆ తర్వాత మైనింగ్ లీజుగా మారుస్తారు.
అయితే ప్రభుత్వ నిబంధనలు ఎప్పుడూ పేపర్ల మీదనే ఉంటాయి. ఎవరూ పట్టించుకోరు. మైనింగ్ చేసే వాళ్లు చేసుకెళ్లిపోతూంటారు. ఇప్పటి వరకూ ఐరన్ ఓర్, గ్రానైట్ , మాంగనీస్ వంటివాటిని తవ్వుకుపోయారు. కానీ వాటితో పోలిస్తే వజ్రాల తీరు వేరు. అదీ కూడా కడప జిల్లాలోఅంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పూర్తిగా తేల్చేసినందున ఇక కడప జిల్లాలో వజ్రాల మైనింగ్ ఎప్పుడైనా ప్రారంభం కావొచ్చు.