మంత్రి సీతక్కను బీఆర్ఎస్ కొద్ది రోజులుగా టార్గెట్ చేస్తోంది. ఇసుక అక్రమ వెనక సీతక్క హస్తం ఉందంటూ అప్పట్లో ఆరోపణలు గుప్పించిన బీఆర్ఎస్.. ఇటీవల ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ విమర్శలు ఎక్కుపెట్టింది. తాజాగా కాంగ్రెస్ పాలనలో పంచాయితీలు నిర్లక్ష్యానికి గురి అవుతున్నాయని సీతక్క సంబంధిత శాఖపై హరీష్ రావు విమర్శలు చేశారు.
సీతక్కను బీఆర్ఎస్ వరుసగా టార్గెట్ చేయడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పలువురు మంత్రులపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నా అదే పరంపర కొనసాగించడం లేదు. కానీ, సీతక్క విషయంలోనే ఒకరు అందుకున్నాక మరొకరు అందుకుంటుండం చర్చనీయాంశం అవుతోంది.
సీఎం రేవంత్ పై ఎంత ఎదురుదాడి చేస్తున్నా బీఆర్ఎస్ సక్సెస్ కాలేకపోతోంది. అందుకే రేవంత్ టీమ్ లో కీలకంగా ఉండే సీతక్కను అప్రతిష్టపాలు చేస్తే .. కాంగ్రెస్ సర్కార్ ను ఇరుకునపెట్టేందుకు అవకాశం ఉంటుందన్న లెక్కతోనే బీఆర్ఎస్ నేతలు సీతక్కను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తునారన్న టాక్ వినిపిస్తోంది.
బీఆర్ఎస్ హయాంలో రేవంత్ ను నైతికంగా దెబ్బతీసేందుకు సీతక్కను పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా, మంత్రి పదవి కూడా ఆఫర్ చేశారని ప్రచారం నడిచింది. అయితే , బీఆర్ఎస్ ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించారని..ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. ప్రభుత్వంలో ఆమె కీలకంగా మారడంతో.. సీతక్క టార్గెట్ గా బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని అంటున్నారు.