దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి కాపలా కాసే సైనికుడ్ని అనకాపల్లిలో పోలీసులు చితకబాదిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇద్దరు దౌర్జన్యం చేసి.. కాదని మరో ఇద్దర్ని స్టేషన్ నుంచి పిలిపించి.. దాడి చేయడంతో ఇదేం పోలీసింగ్ అనే ప్రశ్న వినిపించింది. చివరికి వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు ఆ నలుగుర్ని వీఆర్‌కు పంపి చేతులు దులుపుకున్నారు. కానీ ఒక్క రోజులోనే వాళ్లని సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటన చేశారు. ఇలా ఎందుకు చేశారన్న దానిపై పోలీసు వర్గాల్లోనే రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్మీ ఉద్యోగితో వ్యవహరించిన విధానం పూర్తిగా రికార్డు అయింది.
స్వయంగా కానిస్టేబుల్ కూడా ఎందుకు దాడి చేశామో చెప్పారు. ఓటీపీ చెప్పలేదని దాడి చేశామని పోలీసులు చెప్పారు. ఓటీపీ అనేది ఎవరికీ షేర్ చేయకూడనిది. అసలు దిశా యాప్ మగవాళ్ల ఫోన్ లో ఎందుకో ఇంత వరకూ చెప్పుకోలేకపోయారు. తాను ఆర్మీ జవాన్ ను అని చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఆయనపై దాడి చేయడం.. ఆయన ఐడీ కార్డును లాక్కుని వెళ్లడంపై … ఆర్మీ ఉన్నతాధికారులు ఆరా తీసినట్లుగా చెబుతున్నారు. జవాన్‌పై ఇంత దారుణంగా వ్యవహరించిన పోలీసులను కేవలం వీఆర్ కు పంపి ఊరుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే ఒక్క రోజులోనే ఆ నలుగుర్ని సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారని అంటున్నారు.
ఏపీ పోలీసుల వ్యవహారం… దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతూనే ఉంది. ఓ వైపు సీఐడీ పోలీసులు మరో వైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు.. తమ చేష్టలతో.. వీరు చట్టాన్నే అమలు చేస్తున్నారా లేకపోతే సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా అన్న చర్చ ఎప్పటికప్పుడు సాగుతూనే ఉంది. ఇలాంటి వ్యవహారాలతో పదే పదే వైరల్ అవుతున్నారు.