వైసీపీ పాలనలో ఓ వెలుగు వెలిగిన నేతలంతా తమ స్వరం వినిపిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ, తదనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలపై పెదవి విరుస్తున్నారు. కూటమి టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కానీ,ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2గా కొనసాగిన ఆ కీలక నేత మాత్రం సైలెంట్ గా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆయన ఎవరో కాదు విజయసాయిరెడ్డి… జగన్ తర్వాత వైసీపీలో మెయిన్ లీడర్. తర్వాత సజ్జలకు పార్టీలో ప్రియార్టి పెరగడంతో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందనేది ఓపెన్ సీక్రెట్. కానీ, ఆయనను అనూహ్యంగా ఈ ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ సెగ్మెంట్ నుంచి జగన్ బరిలో నిలిపారు. అయినా ప్రచారంలో విజయసాయి పరుగులు పెట్టారు. హడావిడి చేశారు. పోలింగ్ ముగియగానే అంతలోనే గప్ చుప్ అయ్యారు.
గతంలో టీడీపీ అంటేనే ఒంటికాలి మీద లేచే ఆయన పోలింగ్ తర్వాత జరుగుతోన్న పరిణామాలపై స్పందించకపోవడంపై పలు రకాల చర్చ జరుగుతోంది. వైసీపీ ఓడుతుందని అంచనాకు వచ్చే విజయసాయి రెడ్డి సైలెంట్ అయ్యారా..? లేక తనకు ఓడిపోయే సీటు ఇచ్చారనే మనస్తాపమే ఈ మౌనానికి కారణమా..? అనేది వైసీపీ వర్గాల్లోనూ చర్చగా మారింది.
అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణా రెడ్డి, పేర్ని నాని, జోగి రమేష్ లు మీడియా ముంగిటకు వచ్చి కూటమి లక్ష్యంగా రెచ్చిపోయి విమర్శలు చేస్తుంటే… గతంలో ఇదే తరహ విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి మౌనం ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలింది. మరి.. ఫలితాలు వెల్లడి అయ్యాక అయినా విజయసాయి మౌనం వీడుతారా..? సైలెన్స్ ను బద్దలు కొడుతూ సంచలనాలకు కేంద్రబిందువు అవుతారా..?అనేది చూడాలి.