వ్రతం చెడినా ఫలితం దక్కాలంటారు. ఈ నియయానికి చిత్రసీమలో ఇంకాస్త ఎక్కువ విలువ ఉంది. ఎన్ని చోట్ల తగ్గినా.. బాక్సాఫీసు దగ్గర గెలవడానికే చూస్తారు. రానా కూడా అదే అనుకొన్నాడు. విరాటపర్వం కథ ఓకే చెప్పినప్పుడు కచ్చితంగా అది `సాయి పల్లవి సినిమానే` అనే సంగతి తనకు తెలుసు. ఎందుకంటే ఈ కథని ఎలా చెప్పినా సాయి పల్లవి పై తప్ప ఇంకెవ్వరినా ఫోకస్ పడదు. సినిమా అంతా అయిపోయిన తరవాత అది మరింత స్పష్టమైంది. అందుకే రానా ముందుకొచ్చి.. `ఇది సాయి పల్లవి కోసం తీసిన సినిమా` అని సినిమాపై తన అభిమానాన్ని చాటుకొన్నాడు.
హీరోలెప్పుడూ ఓ మెట్టు దిగడానికి ఇష్టపడరు. వాళ్ల లెక్కలు వాళ్లవి. సినిమాలో హీరోయిన్ ది అప్పర్ హ్యాండ్ అంటే ఒప్పుకోరు. రానా ఈ రెండూ చేశాడు. సినిమా కోసం. సినిమా ఫలితం బాగుంటే చాలు, కమర్షియల్ గా ఆడి, తనకూ కొంత పేరొస్తే చాలు అనుకొన్నాడు. కానీ ఈ రెండు కూడా రానాకు దూరం అయిపోయాయి. విరాటపర్వం విడుదలైంది. అందరూ `నిజాయతీ గల ప్రయత్నం` అంటూ మెచ్చుకుంటున్నారు. తెలుగు సినిమాకు `నిజాయతీ గల ప్రయత్నం` అనే కాంప్లిమెంట్ వచ్చిందంటే.. పరోక్షంగా డబ్బులు రాని సినిమా అని తేల్చేసినట్టే. విరాటపర్వం కూడా ఈ జాబితాలో చేరిపోవొచ్చు. సినిమా చూశాక.. సాయి పల్లవి తప్ప, ఈ పాత్ర కోసం రానా చేసిన త్యాగం, తన కమర్షియల్ లెక్కలు ఇవేం ఎవరికీ గుర్తుండవు. మరోసారి రానా తన వంతు ప్రయత్నం నిజాయతీగానే చేశాడు. కానీ ఫలితమే… ఇంకా వందల కిలోమీటర్ల దూరంలో ఉండిపోయింది.