తెలుగుదేశం పార్టీ యాప్‌లో ఉన్న సమాచారం అంతా పోలీసుల ద్వారా టీఆర్ఎస్ తస్కరించి, వైసీపీకు అందజేసిందని మంత్రి దేవినని ఉమ ఆరోపిస్తున్నారు. వారు టీడీపీ కార్యకర్తల ఫోన్లకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు గొల్లపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త శీను నాయక్‌కు హైదరాబాద్ నెంబర్ నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్ రికార్డింగ్‌ను మీడియా ముందు వినిపించారు. 040 38134078 అనే నెంబర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాల్ సెంటర్‌కు చెందినదని.. ఆ నెంబర్ నుంచి అనేక మంది టీడీపీ కార్యకర్తలకు ఫోన్లు చేసి మీ డేటా అంతా ఉందని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, వైసీపీకి ఓటు వేయాలని హెచ్చరిస్తున్నారని కాల్ అందుకున్న టీడీపీ కార్యకర్త ఆరోపించారు. ఆ మేరకు కాల్ రికార్డింగ్‌ను సాక్ష్యంగా మీడియాకు వినిపించారు.
తెలుగుదేశం పార్టీ యాప్ సేవామిత్రను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థపై ఉద్దేశపూర్వకంగానే పోలీసులు దాడి చేసి డేటా అంతా సేకరించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ సమాచారం మొత్తం వైసీపీకి చేరిపోయిందని, దానికి ఈ ఫోన్ కాల్సే సాక్ష్యమంటున్నారు. అసలు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ డేటా సేవామిత్ర యాప్‌లో ఉందో చెప్పకుండా, ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓటర్ కార్డులు ఉన్నాయని చెబుతున్నారు. అయితే అవి కచ్చితంగా ఉన్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులే చెబుతున్నారు. కేవలం ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి తీసుకున్న స్టేట్మెంట్లో మాత్రమే ప్రభుత్వ డాటా ఉందని చెబుతున్నారు. అసలు ఉందో లేదో ఐటీ గ్రిడ్ యజమాని అశోక్ వస్తేనే తెలుస్తుందని పోలీసులకు అర్థమయింది. ఆయన కోసం వెదుకుతున్నట్లు చెబుతున్నారు.
అయితే సేవామిత్ర యాప్‌లోని ప్రాథమిక సమాచారం మాత్రం ఆ సంస్థ నుంచి బలవంతంగా తీసుకెళ్లిన సీపీయూలు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో కూడా ఉందని, ఆ సమాచారం మొత్తం వైసీపీకి చేరిపోయిందని.. అందులో అరవై లక్షల మంది టీడీపీ కార్యకర్తలు, బూత్ లెవల్ కార్యకర్తల వివరాలు ఉన్నాయని ఇప్పుడు వారందర్నీ ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు వరుసగా వస్తున్న ఫోన్లతో అది నిజమేనా అనే పరిస్థితి కనిపిస్తోంది.