సంక్రాంతికి రావాల్సిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. సంక్రాంతికి థియేటర్ల దగ్గర పోటీ ఎక్కువ ఉండడం, సినిమా అనుకొన్న సమయానికి రెడీ కాకపోవడం వల్ల… వేసవికి వాయిదా పడింది. ఈనెల 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఫ్యామిలీ సినిమా, పైగా వేసవి సీజన్… ఓరకంగా సంక్రాంతి కంటే, ఇది మంచి టైమింగే. కాకపోతే.. ఈ సినిమాపై దిల్ రాజుకి కొన్ని భయాలు ఉన్నాయి. ‘ఫ్యామిలీ’ ముద్ర పడితే, యంగ్‌స్టర్స్ థియేటర్లకు రారేమో అనే కంగారు ఉంది. ఎందుకంటే.. గతంలో ‘శతమానం భవతి’ బాగా ఆడినా.. యూత్ ఫుట్ ఫాల్స్ లేవు. వాళ్లు గనుక వస్తే.. ఆ సినిమా మరింత బాగా ఆడేది. ఈ ఎనాలిసీస్ ఇచ్చింది స్వయంగా దిల్ రాజునే. ”బొమ్మరిల్లు సినిమా యూత్, ఫ్యామిలీ మొత్తం చూశారు. కాబట్టే అంత గొప్పగా ఆడింది. ‘శతమానం భవతి’ యూత్ కి పెద్దగా నచ్చలేదు. టీవీ సీరియల్ లా ఉందన్నారు” అంటూ తన సినిమాపై రియల్ రివ్యూ ఇచ్చుకొన్నారాయన. ‘ఫ్యామిలీస్టార్’ కూడా యూత్‌కి దూరం అవుతుందేమో అన్న భయం ఉంది. అందుకే ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లలో ‘ఇది యూత్ సినిమా’ అని కాస్త గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారాయన.
”టైటిల్ ఫ్యామిలీ స్టార్ అని పెట్టినా, మంచి లవ్ స్టోరీ ఉంది ఈ సినిమాలో. అది యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది” అంటూ.. మరోసారి ఈ సినిమాని కొత్త యాంగిల్ లో ప్రమోట్ చేస్తున్నారు దిల్ రాజు. ఏపీలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అక్కడ రాజకీయాల తప్ప, మరో ప్రస్తావన లేదు. అక్కడ ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో అన్న ఆందోళన కాస్త దిల్ రాజులో ఉంది. సినిమాకి మంచి టాక్ వచ్చి, కాస్త నిలబడగలిగితే.. మెల్లగా పుంజుకోవచ్చని అనుకొంటున్నారు. కాస్తలో కాస్త యూత్ లో విజయ్ కి మంచి క్రేజ్ ఉండడం అడ్వాంటేజ్ అనుకోవాలి. దానికి తోడు ‘ఫ్యామిలీ స్టార్‌కి’ అటూ ఇటూ కూడా పోటీ ఇచ్చే సినిమా లేదు. ‘టిల్లు స్క్వేర్’ సినిమా రన్నింగ్ లో ఉంది. ఆ సినిమాకి మంచి టాక్ వచ్చి బాక్సాఫీసు దగ్గర దూసుకుపోతోంది. ‘ఫ్యామిలీ స్టార్’ వచ్చే సరికి ‘టిల్లు..’ హడావుడి తగ్గొచ్చు.