ఓటీటీ రంగం బాగా విస్తరిస్తోంది. భవిష్యత్తు అంతా ఓటీటీ చేతుల్లోనే ఉంటుందని చిత్రసీమ గట్టిగా నమ్ముతోంది. అందుకే ఓటీటీ సంస్థలు మరిన్ని పుట్టుకొస్తున్నాయి. తాజాగా దిల్ రాజు కూడా ఓటీటీ రంగంలోకి దిగబోతున్నారు. `మ్యాంగో`తో కలిసి దిల్ రాజు ఓ కొత్త ఓటీటీ సంస్థని స్థాపించే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారని టాక్. అందుకోసం దాదాపు 25 చిన్న సినిమాల్ని ఒకేసారి నిర్మించాలని భావిస్తున్నారు. ఒక్కో సినిమాకీ దాదాపు 5 కోట్లు పెట్టుబడే పెట్టే ఆలోచన చేస్తున్నారు. 2024లో ఈ ఓటీటీ సంస్థ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగే అవకాశం ఉంది. దిల్ రాజు యేడాదికి కనీసం ఆరేడు సినిమాలు తీయగల సత్తా ఉన్న నిర్మాత. తన సొంత సినిమాలన్నీ తన ఓటీటీకే వెళ్లిపోతాయి. డిస్టిబ్యూషన్ కూడా ఉంది కాబట్టి, ఆ సినిమాల హక్కుల్నీ మంచి రేటుకి కొనుగోలు చేసుకోవొచ్చు. పైగా ఈమధ్య దిల్ రాజు నుంచి ఓ కొత్త ఉప సంస్థ పుట్టుకొచ్చింది. ఆ సంస్థ ద్వారా చిన్న సినిమాల్ని తీస్తున్నారు. ఓటీటీ వ్యూహంలో భాగంగానే దిల్ రాజు `బలగం` లాంటి సినిమాల్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. పైగా దిల్ రాజు దగ్గరకు చాలా కథలు వెళ్తుంటాయి. అన్నింటినీ ఆయన సినిమాలుగా చేయలేరు. మంచి కథల్ని కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. ఓటీటీ చేతిలో ఉంటే ఆయా కథలూ సినిమాలైపోతాయి. మ్యాంగో దగ్గర కొన్ని వందల సినిమాలున్నాయి. అందుకే మ్యాంగోని పార్టనర్‌గా తీసుకొన్నట్టు తెలుస్తోంది.