దిల్రాజు హ్యాండు యమ రేంజులో ఉంది. ఆయన సినిమా తీయక్కర్లెద్దు…. తీద్దామనుకొన్నా చాలు – దానికి ఆల్రెడీ హిట్ టాక్ వచ్చేస్తోంది. సినిమా అటూ ఇటుగా ఉన్నా – ఆయన టైమింగ్, కాంబినేషన్లు, పబ్లిసిటీ వెరసి సినిమాని హిట్ చేసేస్తున్నాయి. తాజాగా రాజా ది గ్రేట్ కూడా హిట్ జాబితాలో చేరిపోయింది. సినిమా స్థాయికి మించి వసూళ్లు వస్తున్నాయన్నది నిజం. ఇదంతా దిల్రాజు మహిమే.. లాజిక్కి అందని సన్నివేశాలతో కథానాయకుడినే కాదు, ప్రేక్షకుల్నీ గుడ్డివాళ్లని చేశాడు దర్శకుడు. అది సినిమా కాబట్టి, ఎంటర్టైన్మెంట్కి లాజిక్కులతో పనిలేదు కాబట్టి లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఈ సినిమాకి ప్రొడ్యూసరు దిల్రాజు. ఆయన ఇలాంటి లాజిక్కుల్ని బాగా పట్టించుకొనే వ్యక్తి. అయినా సరే సినిమా ఆయన్నుంచి పాస్ అయిపోయింది.
ఏదైతేనేం.. సినిమా గట్టెక్కేసింది. వచ్చే వారం కూడా పెద్ద సినిమాలు లేవు కాబట్టి సినిమాని ఇంకాస్త ముందుకు లాగిద్దాం అనుకొంటున్నాడు దిల్రాజు. అందుకు తగ్గట్టు పబ్లిసిటీ కూడా ఎక్కడా తగ్గకుండా చూసుకొంటున్నాడు. గుంటూరులో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసిన దిల్రాజు, ఈరోజు హైదరాబాద్లో అంధ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ షో ఏర్పాటు చేశాడు. దిల్ రాజు ఉద్దేశ్యం మంచిదే. కాకపోతే… ఇదో మామూలు కమర్షియల్ సినిమా. కళ్లు లేని వాళ్లు స్ఫూర్తి పొందడానికో, వాళ్లకు ఓ పాఠంగా వివరించడానికో ఈ సినిమాలో, కథలో గొప్ప విషయమూ లేదు. దానికి తోడు.. రవితేజ ట్రైను పట్టుకొని వెళ్లే సన్నివేశం తెలుగు చిత్రసీమలోనే ఎపిక్ అన్నట్టు వ్యంగ్యంగా మాట్లాడుకొంటోంది చిత్రసీమ. ఈ దశలో అంధులకు సినిమా చూపించడం కూడా పబ్లిసిటీ జిమ్మిక్కే తప్ప మరేం లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.