ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌లో ని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొద్ది రోజుల నుంచీ ఆయన ఊపిరి తీత్తులలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. గురువారం ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈరోజు నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలెట్టింది. వందకు పైగానే సినిమాలకు దర్శకత్వం వహించిన అతి కొద్ది మందిలో కోడి రామకృష్ణ ఒకరు. స్టార్ హీరోలతో పనిచేశారు. చాలామందిని స్టార్స్‌గా తీర్చిదిద్దారు. ఆయన పాలకొల్లులో జన్మించారు. పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేసాడు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకునిగా తన కెరీర్ ప్రారంభించి పలు చిత్రాలకు దర్శత్వం వహించారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథా నాయకులందరితో ఆయన సినిమాలు చేశాడు. తెలుగులోనే కాక తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకూ దర్శకత్వం వహించాడు.
కోడి రామకృష్ణ స్వస్థలం పాలకొల్లు. ఆయన తల్లిదండ్రులు నరసింహమూర్తి, చిట్టెమ్మ. ఆయన ప్రాథమిక విద్య నుంచి కళాశాల వరకూ మొత్తం పాలకొల్లులోనే సాగింది. ఆయన కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే చిత్రకళ వృత్తినీ చేపట్టారు. పగలు చదువుకోవడంతోపాటు అజంతా పెయింటింగ్స్ అనే కమర్షియల్ పెయింటింగ్స్ షాపును రాత్రిళ్ళు నిర్వహించేవారు. ఆయన చిత్రాలు గురువు నాగేశ్వరరావుతో ఫొటోలు తీయించుకుని నటునిగా అవకాశం కోసం పలువురు దర్శకులకు పంపేవారు. అయితే ఆ విషయం తెలిసిన ఆయన తండ్రి నరసింహమూర్తి – “మన వంశంలో డిగ్రీ వరకూ చదువుకున్న వారే లేరు. నువ్వు డిగ్రీ పూర్తిచేస్తే చూడాలనివుంది. డిగ్రీ చదివాకా నీకేది చెయ్యాలని తోస్తే ఆ పనే చేసుకో” అని కోరారు. దాంతో అప్పటి నుంచీ సినిమా ప్రయత్నాలు మానుకుని డిగ్రీ పూర్తిచేశారు
దాసరి నారాయణరావు తొలిచిత్రం తాత మనవడు చూశాకా రామకృష్ణ మనస్సులో దర్శకత్వ శాఖలో పనిచేస్తే ఈయన వద్దే పనిచేయాలన్న దృఢసంకల్పం ఏర్పడింది. ఆ సినిమా అర్థశతదినోత్సవం పాలకొల్లులోని మారుతీ టాకీస్ లో జరిగే సందర్భాన్ని పురస్కరించుకుని దాసరితో మాట్లాడి తనకు దర్శకత్వ శాఖలో అవకాశం ఇమ్మని అడిగేందుకు కోడి రామకృష్ణ ప్రణాళిక వేసుకున్నారు. అనుకోని విధంగా ఆ కార్యక్రమంలో చెలరేగిన గొడవల్లో రామకృష్ణ స్నేహితులూ పాల్గొనడంతో, కార్యక్రమం ముగిశాకా ఆయన నిర్మాత రాఘవ, దర్శకుడు నారాయణరావులకు వారి తరఫున క్షమాపణలు చెప్పారు. అయితే అదే సమయంలో దాసరి వద్ద పనిచేయాలన్న తన కోరికనూ వెలిబుచ్చారు. ఆయన డిగ్రీ పూర్తిచేసుకుని వస్తే చూద్దామనడంతో రామకృష్ణ డిగ్రీ పూర్తిచేసుకుని ఆ విషయాన్ని దాసరికి ఉత్తరం రాశారు. వెంటనే బయలుదేరమంటూ దాసరి నుంచి టెలిగ్రాం రావడంతో, ఛార్జీల కోసం పల్లెపడుచు నాటకాన్ని మిత్రులంతా ప్రదర్శించి ఆ డబ్బుతో మద్రాసు బయలుదేరారు.
దాసరి నారాయణరావు ఒకేసారి రెండు, మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తూండేవారు. ఆ క్రమంలో ఎవరికి వారే యమునా తీరే, స్వర్గం నరకం, మనుషుల్లో దేవుడు అన్న మూడు సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్ గా తీసుకున్నారు. అలా దాసరి నటించిన పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తూన్న కోడి రామకృష్ణ, ఎలాగైనా దాసరిని దర్శకునిణ్ణి చేసిన రాఘవ బ్యానర్లోనే తొలిగా దర్శకుడు కావాలని ఆశించారు. అందుకు అనుగుణంగా దాసరి-రాఘవ కాంబినేషన్లో నిర్మించిన తూర్పు పడమర సినిమాలో పట్టుబట్టి దర్శకత్వ శాఖలో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత కోడి రామకృష్ణకు దర్శకునిగా అవకాశం వచ్చి దర్శకత్వ శాఖలో పనిచేయడం మానుకున్నారు.