‘కలర్ ఫొటో’ అనే ఓ చిన్న సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించాడు సందీప్ రాజ్. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర గొప్ప వసూళ్లేం సాధించలేదు కానీ, విమర్శకుల ప్రశంసలు అందుకొంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డునీ సాధించింది. దాంతో ఆటోమెటిగ్గా… ఆ దర్శకుడిపై అందరి కళ్లూ పడతాయి. అందులో భాగంగానే రవితేజకు ఓ కథ చెప్పి ఒప్పించాడు. రవితేజ మీటర్లోనే పూర్తి కమర్షియల్ గా సాగే కథ ఇది. నిర్మాత కూడా దొరికేశాడు.
కాకపోతే… ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోలు కూడా కావాలి. మంచు మనోజ్, శర్వానంద్ లకు సరిపడా పాత్రలు ఈ కథలో ఉన్నాయి. వాళ్లకూ ఈ కథ బాగా నచ్చింది. అయితే వీరందరి డేట్లు ఎడ్జస్ట్ కావడమే ఈ ప్రాజెక్ట్ కి పెద్ద సమస్య, రవితేజ ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండే రకం కాదు. ఎవరు త్వరగా స్క్రిప్టు తీసుకొచ్చి, షూటింగ్ పెట్టుకొంటే వాళ్లతో సినిమా ‘ఓకే’ చేసేస్తుంటాడు. గోపీచంద్ మలినేని ఓ కథతో వస్తే.. సందీప్ కథ పక్కన పెట్టి ఆయన సినిమాకు పచ్చజెండా ఊపేశాడు. మైత్రీతో సెట్ కాకపోవడంతో, ఆ సినిమా ఆపేసి వెంటనే హరీష్ శంకర్‌ని లైన్లో పెట్టాడు. హరీష్ సినిమా పూర్తయ్యేంత వరకూ సందీప్ రాజ్ ప్రాజెక్ట్ ముందుకు కదలదు. ఆ తరవాత కూడా మరో ఇద్దరు హీరోల డేట్లు దొరకాలి.
రవితేజను కాదని, మరో సినిమా మొదలెడితే, రవితేజ ఏమనుకొంటాడో అనే మొహమాటం కూడా సందీప్‌కి ఉంది. అటు ముందుకు వెళ్లలేడు. ఇటు వెనక్కి రాలేడు. రవితేజ కరుణించేంత వరకూ ఎదురు చూడక తప్పని పరిస్థితి ఇది.