హైదరాబాద్‌లో ప్రముఖ నగల వ్యాపారిగా పేరు పొందిన ఎంబీఎస్ జ్యూయలర్స్‌కు చెందిన సుఖేష్ గుప్తాకు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ షాకిచ్చింది. ఎంబీఎస్ జ్యువెలర్స్‌కు ఏకంగా 222 కోట్ల 44 లక్షల రూపాయల జరిమానా విధించింది. వ్యక్తిగతంగా సుఖేష్‌గుప్తాకు 22 కోట్ల జరిమానా విధించింది. విదేశాల నుంచి నిధులు తీసుకు రావడంలో సుఖేష్ గుప్తా, ఎంబీఎస్ జ్యూయలర్స్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా ఈడీ తేల్చింది. అనుమానాస్పదంగా విదేశీ కంపెనీతో లావాదేవీలు నిర్వహించారు.
హాంకాంగ్‌కు చెందిన లింక్‌పై అనే కంపెనీకి డైమండ్స్ సరఫరా చేసినట్లుగా చూపించి పెద్ద ఎత్తున నిధులను ఇండియాకు తీసుకు వచ్చారు. ఈ లావాదేవీలన్నీ అనుమానాస్పదంగా ఉండటంతో.. విదేశీ పెట్టుబడుల చట్టాలను ఉల్లంఘించినట్లుగా ఈడీ గుర్తించింది. ఈడీ చరిత్రలో ఇంత భారీ జరిమానా విధించడం ఇదే తొలి సారి. సుఖేష్ గుప్తాపై గతంలోనూ పెద్ద ఎత్తున కేసులు ఉన్నాయి. కోల్‌కతా కోర్టు ఆదేశాల మేరకు 2019 అక్టోబర్‌లో ఆయనను ఓ సారి అరెస్ట్ చేశారు.
తన వ్యాపారం విషయంలో మెటల్స్ మినరల్స్ ట్రేడింగ్ కార్పోరేషన్ కు కూడా సుఖేష్ గుప్తా పెద్ద ఎత్తున బాకీ పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులోనూ ఈయన పేరు వినిపించింది. సుఖేష్ గుప్తా పేరు చాలా వైట్ కాలర్ క్రైమ్స్‌లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు వెదుకుతున్నారు. కొన్ని రోజుల క్రితం.. ఓ మీడియా ప్రముఖుడి ఇంట్లో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ.. ఇంట్లో లేరు. ఆ తర్వాత ఎక్కడైనా అరెస్ట్ చేసినట్లుగా తెలియలేదు.