ఈమధ్య బాక్సాఫీసు దగ్గర కాస్త మెరిసిన సినిమాల్లో ‘ఆయ్’, ‘కమిటీ కుర్రాళ్లు’ ఉన్నాయి. వరుస ఫ్లాపులకు కాస్త బ్రేక్ ఇచ్చిన సినిమాలు ఇవి. ఈ రెండు చిత్రాల్నీ కొత్త దర్శకులే తెరకెక్కించడం విశేషం. ఆయ్ సినిమాతో అంజి దర్శకుడిగా పరిచయం అయ్యారు. కమిటీ కుర్రాళ్లు’ చిత్రంతో వంశీ మెగాఫోన్ పట్టాడు. ఇప్పుడు ఈ ఇద్దరు దర్శకులకు చేతి నిండా ఆఫర్లే ఆఫర్లు.
‘ఆయ్’ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ‘ఆయ్’ షూటింగ్ సమయంలోనే అంజితో మరో సినిమాకు అగ్రిమెంట్ జరిగిపోయింది. ‘ఆయ్’ హిట్టయినా, ఫ్లాప్ అయినా, గీతా 2లోనే ఓ సినిమా చేయాలన్నది ఒప్పందం. సో.. అంజి తదుపరి సినిమా గీతా ఆర్ట్స్ లోనే. ‘కమిటీ కుర్రాళ్లు’ దర్శకుడు వంశీ కూడా నిర్మాతల కళ్లల్లో పడ్డాడు. ఇద్దరు నిర్మాత దగ్గర వంశీ అడ్వాన్సు తీసుకొన్నాడని తెలుస్తోంది. అయితే హీరో దొరకాలి. ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ దర్శకుడు లక్ష్మణ్ కార్య కూడా ఓకే అనిపించుకొన్నాడు. అంతకు ముందు ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే సినిమా తీశాడు లక్ష్మణ్. ఆ సినిమా కంటే ‘మారుతి నగర్’లో బెటర్ అవుట్ పుట్ ఇచ్చాడు. ఈటీవీ విన్లో వచ్చిన ‘వీరాంజనేయులు విహార యాత్ర’కూ మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సినిమాతో అనురాగ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఓటీటీ సినిమానే అయినా, అనురాగ్ కి మంచి గుర్తింపు దక్కింది. ఓ చిన్న పాయింట్ ని చాలా డీసెంట్ గా, కామెడీ టచ్‌తో డీల్ చేసిన విధానం అందరికీ నచ్చింది. ఈటీవీ విన్లోనే అనురాగ్ మరో సినిమా చేస్తాడని టాక్. ఇలోగా మరో ఇద్దరు ముగ్గురు నిర్మాతలు అనురాగ్ తో సంప్రదింపులు మొదలెట్టారు. హీరోలు, మీడియం రేంజు నిర్మాతలూ ఈ దర్శకులపై కాస్త దృష్టి పెట్టే అవకాశం ఉంది. అదృష్టం బాగుండి కాస్త పేరున్న హీరో దొరికితే వీళ్ల ప్రయాణం మరింత మెరుగ్గా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.