ఏపీ ఎన్నికల ఫలితాలపై రాజధాని భవితవ్యం ఆధారపడి ఉంది. ఫ్యాన్ గాలి వీస్తే విశాఖ వేదికగా పరిపాలన సాగడం ఖాయం. సైకిల్ పరుగులు పెడితే మాత్రం అమరావతి క్యాపిటల్ సిటీ అవ్వడం పక్కా. ఈ ఉత్కంఠపోరులో ఎవరు గెలుస్తారని రాష్ట్ర ప్రజలు జడ్జిమెంట్ డే కోసం వెయిట్ చేస్తున్నారు.
ఇప్పటికే వైసీపీ గెలిస్తే విశాఖ వేదికగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ…కూటమి గెలిస్తే అమరావతి వేదికగా చంద్రబాబు సీఎంగా ప్రమాస్వీకారం చేస్తారని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. దీంతో గెలిచే పార్టీని బట్టి క్యాపిటల్ సిటీ ఏది అన్నది త్వరలోనే తేలనుంది.
సాధారణంగా రాజధానిని ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయించి నిర్మాణం చేస్తారు. కాని ఏపీలో మాత్రం పార్టీల గెలుపు ఆధారంగా రాజధాని డిసైడ్ అవుతోంది.వాస్తవానికి అమరావతిని రాజధానిగా టీడీపీ నిర్ణయించినప్పుడు ఎవరూ అభ్యంతరం తెలపలేదు. కాని, వైసీపీ అధికారంలోకి వచ్చాకే రాజధాని ఇష్యూను వివాదంగా మలిచి ఏపీకి రాజధాని లేకుండా చేసిన పాపం మూటగట్టుకుంది.
ఈసారి ఎన్నికల్లో ఈ అంశం కూడా ప్రధానంగా హైలెట్ అయింది. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దారని జగన్ రెడ్డిపై విమర్శలు వచ్చాయి. దీంతో ఈ ఎన్నికల్లో విశాఖ గెలుస్తుందా..? అమరావతి గెలుస్తుందా..? అనే అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తోంది. చూడాలి మరి జూన్ 4న ఏం తేలుతుందో..!!