ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదు అనేది ఎప్పుడో తేలిపోయింది. ఇచ్చే ఉద్దేశంలో కేంద్రం లేదని కూడా ఎప్పుడో అర్థమైపోయింది. కేంద్రాన్ని ఎన్ని రకాలుగా, ఎంతమంది ప్రశ్నించినా, ఒత్తిడి పెంచే ప్రయత్నం ఎంత చేసినా ప్రయోజనం ఉండదనేది సుస్పష్టం. చేయాల్సిన సమయంలో సరైన పోరాటం చేయకుండా.. అంతా అయిపోయాక ఇప్పటికీ అదే పాత ప్రశ్నలతో చర్చకు దిగితే ఎలా..? ఇలాంటి చర్చ వల్ల ఏం ప్రయోజనం…? ప్రస్తుతం రాజ్యసభలో జరిగింది ఇదే. ఏపీ ప్రత్యేక హోదా అంశం మరోసారి చర్చకు వచ్చింది.
కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మరోసారి ఇదే అంశాన్ని సభలో ప్రస్థావించారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామంటూ పార్లమెంటులో హామీ ఇచ్చారన్న సంగతి గుర్తుచేసుకోవాలని అన్నారు. అరుణ్ జైట్లీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదాకి కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారనీ, కానీ.. ఆయన ఆర్థికమంత్రి అయిన తరువాత 14వ ఆర్థిక సంఘం అంటూ సాకులు చెబుతున్నారన్నారు. హోదాకీ ఆర్థిక సంఘానికీ సంబంధం లేదని అన్నారు. మొత్తంగా, కేవీపీ కొత్తగా చెప్పిందేం లేదు. కొత్తగా ప్రభుత్వాన్ని నిలదీసిందేం లేదు. పాత ప్రసంగాన్నే మళ్లీ వల్లెవేసినట్టయింది.
పోనీ.. ఈ సందర్భంగా భాజపా చెప్పిన సమాధానంలో అయినా ఏమైనా కొత్త విషయం ఉందా అంటే.. అదీ లేదు. అదే పాత ఊకదంపుడు ఉపన్యాసాన్ని మరోసారి సభలో వినిపించారు కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్. ప్రత్యేక హోదా చివరిగా ఉత్తరాఖండ్ కి ఎప్పుడో ఆరేళ్ల కిందట ఇచ్చారని అన్నారు. ఏపీకి హోదా ఇస్తామని మన్మోహన్ ప్రధాని హోదా చెప్పినా.. ఆ తరువాత, ఆర్థిక సంఘం వచ్చేసిందనీ, పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన చేసినా… దానికి జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం తీసుకోలేదని కేంద్రమంత్రి వివరించారు. చివరికి ఆయన తేల్చి చెప్పింది ఏంటంటే… ఏపీని ప్రత్యేక కేటగిరి రాష్ట్రంగా పరిగణించి, అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం అని.
నిజానికి, ఈ చర్చ వల్ల ప్రత్యేకంగా, కొత్తగా ఏపీకి ఒరిగిందంటూ ఏదైనా ఉందా..? పాత విషయాన్ని కేవీపీ ప్రస్థావించారు. అదే పాత విషయానికి.. కేంద్రం దగ్గరున్న పాచిపోయిన పాత సమాధానమే మరోసారి వినిపించారు. చేయాల్సిన సమయంలో ప్రత్యేక హోదాపై సరైన పోరాటం జరగలేదు. పెంచాల్సిన రీతిలో కేంద్రంపై ఒత్తిడి పెంచలేదు. కేవీపీ కావొచ్చు… మరే ఇతర పార్టీలకు చెందిన ఆంధ్రా ఎంపీలు కావొచ్చు… పార్లమెంటులో సరైన రీతిలో కేంద్రాన్ని నిలదీసింది లేదు. ఇప్పటికీ నిలదీస్తున్నదీ లేదు. పార్లమెంటు కంటే ఆర్థిక సంఘం పెద్దదా..? ఆర్థిక సంఘం సిఫార్సులను కాదనేంత శక్తి పార్లమెంటుకు లేదా..? ఇతర రాష్ట్రాలు ఏర్పడ్డ తీరుగా ఆంధ్రా విభజన జరిగిందా..? తెలంగాణ ఏర్పాటు క్రమంలో ఆంధ్రుల ప్రయోజనాల్ని ఎలా తుంగలోకి తొక్కారు..? ఇలా ప్రశ్నించి ఉంటే.. కేంద్రం నుంచి స్పందన వేరేలా వచ్చేది. కానీ, ఈ ఊకదంపుడు ప్రసంగాల వల్ల ఉపయోగం ఏముంటుంది..? చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్టుగానే అన్నట్టుంది.