కేంద్రంలోని మోడీ సర్కారును గద్దెదించాలన్న లక్ష్యంతో భాజపాయేతర పార్టీలు కోల్ కతా ర్యాలీలో మరోసారి గట్టి స్వరమే వినిపించాయి. దాదాపు 20 పార్టీల జాతీయ నాయకులు ఒకే వేదిక మీదికి వచ్చారు. ప్రధాని అభ్యర్థిత్వంపై చర్చ, కూటమికి నాయకత్వం ఎవరు వహించాలనే అంశం… ఇలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ ర్యాలీకి ప్రముఖ నేతలందరూ హాజరుకావడం విశేషం. రాష్ట్రాల హక్కుల్ని కాపాడుకోవాలన్న నినాదమే ఇక్కడ ప్రధానాంశంగా కనిపించింది. అయితే, ఈ ర్యాలీ ప్రభావంపై ఆంధ్రాలో కొంత చర్చకు ఆస్కారం ఉంది. మరీ ముఖ్యంగా ఈ నేపథ్యంలో వైకాపా అధినేత జగన్ తీరు మీద కొంత చర్చ జరిగే అవకాశం ఉందనేది స్పష్టం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య జాతీయ రాజకీయాలపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రాకు అన్యాయం చేసిన భాజపా సర్కారు మీద పోరాటంలో భాగంగా ఈ ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఆంధ్రాలో పాలన గాలికి వదిలేసి, ఢిల్లీ రాజకీయాలంటూ తిరుగుతున్నారంటూ విమర్శించిన వైకాపా కూడా… ఈ మధ్యనే రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందనే వాదనను కొత్తగా వినిపిస్తోంది. అయితే, కేసీఆర్ తో కలిసి జగన్ చేస్తున్న ప్రయత్నం… రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునే ప్రయత్నంగా ప్రజల్లోకి వారు ఆశించిన స్థాయిలో వెళ్లలేదన్నది వాస్తవం. ఏపీ సీఎం చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జగన్, కేసీఆర్ కలుస్తున్నారు అనేదే ప్రధానంగా జరుగుతున్న చర్చగా చెప్పొచ్చు. ఇవాళ్ల కోల్ కతాలో జరిగిన సభ వల్ల… వైకాపా మీద అదే అభిప్రాయం మరింత బలపడే అవకాశమే ఉంది.
ఒకవేళ వైకాపాకి కేంద్రం నుంచి హక్కుల సాధనే అసలైన లక్ష్యం అయితే… జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ముందుకు సాగే ప్రయత్నంలో జగన్ ఇన్నాళ్లూ ఎందుకు భాగస్వాములు కాలేకపోయారు? కేటీఆర్ వచ్చి కలిస్తే తప్ప, ఈ ప్రయోజనాలు గుర్తురాలేదా..? కాంగ్రెస్ కి ప్రధాన శత్రువైన టీడీపీ, గత రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి… రాష్ట్రాల హక్కుల కోసం ఒక అడుగు ముందుకు వేసినప్పుడు… అదే లక్ష్యమని ఇప్పుడు చెబుతున్న జగన్, ఆ స్థాయిలో సాహసోపేతమైన ప్రయత్నాలేవీ ఇంతవరకూ ఎందుకు చెయ్యలేకపోయారు..? కోల్ కతా ర్యాలీ నేపథ్యంలో వైకాపా గురించి ఈ తరహా చర్చ ప్రధానంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇంతకీ… ఈ ర్యాలీని వైకాపా ఎలా చూస్తుంది..? జగన్ దీనిపై ఎలా స్పందిస్తారు అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది.