ప్రశాంత్ కిషోర్… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించారు. ఎన్నికలకు కొన్నేళ్ల ముందు నుంచే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సలహాలూ సూచనలూ వ్యూహాలు తయారుచేసి ఇచ్చారు. ఎన్నికల సమయంలో నియోజక వర్గాలవారీగా, ఇంకా చెప్పాలంటే మండలాల వారీగా నివేదికలు ఇస్తూ, పార్టీ వెనకబడ్డ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి నివేదికలు ఇచ్చారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన తరువాత… కాబోయే సీఎం జగన్ చెప్పేసి, ప్రశాంత్ కిషోర్ అండ్ టీమ్ ఇక్కడ్నుంచీ వెళ్లిపోయింది. అయితే, ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయి. మెజారిటీ సర్వేలు చెబుతున్నది ఏంటంటే…. ఆంధ్రాలో జగన్ అధికారంలోకి రాబోతున్నారనీ, పెద్ద ఎత్తున ఎంపీ స్థానాలను కూడా గెలుచుకోబోతున్నారని. మెజారిటీ జాతీయ మీడియా సంస్థలు కూడా ఇవే అంచనాలను వెల్లడించాయి. అయితే, వైకాపాకి ప్రధాన వ్యూహకర్తగా నిలిచిన ప్రశాంత్ కిషోర్… ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి ఏమీ చెప్పలేదా..? పోల్ మేనేజ్మెంట్ చేసిన ఆయన, ఫలితాలపై ఏదో ఒక నివేదికను జగన్ కు అందజేయకుండానే వెళ్లిపోయారా..? ఒకవేళ ఎన్నికల ఫలితాలపై ఆయన ఒక అంచనా వేసి, జగన్ కి చెప్పి ఉంటే అది ఏమై ఉంటుందనే ప్రశ్నలు ఇప్పుడు తెరమీదికి వస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో వైకాపా పోల్ మేనేజ్మెంట్ చేసిన పీకే అండ్ టీమ్… ఎన్నికల ఫలితాలపై కూడా ఏదో ఒక అంచనా వేసే ఉంటుంది కదా! ఎందుకంటే, వారికే వాస్తవ పరిస్థితి ఇతరుల కంటే స్పష్టంగా అర్థమౌతుంది. కాబట్టి, ఎన్నికల ఫలితాలపై ఎలాంటి అంచనాలు వేయకుండానే పీకే వెళ్లిపోయారని అనుకోలేం. సరే, ఒకవేళ ఆయన ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి ఏదైనా రిపోర్టు తయారు చేసి ఉంటే, జగన్ కి మాత్రమే ఇచ్చారని అనుకుందాం. ఆ రిపోర్టు వైకాపాకి చాలా పోజిటివ్ గా ఉంటే… ఇప్పుడు దాన్ని బయట పెట్టొచ్చు. ఎందుకంటే, జాతీయ మీడియా సంస్థలు జగన్ గెలుపు ఖాయమని 2014 సమయంలోనూ ఇలానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలిచ్చాయి. కానీ, వాస్తవ ఫలితాలు వేరేలా ఉన్నాయి. ఆంధ్రాలో క్షేత్రస్థాయి పరిస్థితిపై జాతీయ మీడియా సంస్థల లెక్కలు తప్పిన సందర్భాలే ఎక్కువ. కాబట్టి, ఇలాంటి సమయంలో పీకే ఏం చెప్పారో వైకాపా అధినేత బయటపెడితే… వైకాపా కార్యకర్తలకు మరింత ఉత్సాహం పెరుగుతుంది. జాతీయ మీడియా అంచనాలు ఎలా ఉన్నా… పీకే ఇచ్చిన గ్రౌండ్ రిపోర్టుపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది కదా!
ఇంతకీ, వైకాపా ఎన్నికల ఫలితాలపై పీకే అంచనాలు వేశారా లేదా అనే అనుమానం కూడా వ్యక్తమౌతోంది. అయితే, క్షేత్రస్థాయిలో వైకాపాతో మమేకమై కొన్నేళ్లపాటు ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి, వాస్తవ పరిస్థితి పీకే అంచనాలకు దొరక్కకుండా పోదు కదా! కాబట్టి, వాస్తవాలు తెలుసు కాబట్టే… ఆ నివేదికను జగన్ కి పీకే ఇచ్చి ఉండరేమో అనే అభిప్రాయమూ కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా, పీకే ఏం చెప్పారన్నది ఇప్పుడు వైకాపా వర్గాల్లో కొంత ఆసక్తికరమైన చర్చగానే కనిపిస్తోంది. మరి, దీనిపై జగన్ స్పందిస్తారో లేదో చూడాలి.