దీపావళిని బ్యాడ్ సీజన్‌గా భావిస్తుంది చిత్రసీమ. అందుకే కొత్త సినిమాలు పెద్దగా రావు. అయితే ఈసారి మాత్రం సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది. ఈ దీపావళి.. బాక్సాఫీసు దగ్గర మెరుపులకు కొదవ లేకుండా పోయింది. ఈ పండక్కి తమిళం నుంచి మూడు సినిమాలు, హిందీ నుంచి ఓ సినిమా వస్తున్నాయి.
తమిళంలో కార్తి నటించిన జపాన్ ఈ దీపావళికి విడుదల అవుతోంది. కార్తి తమిళ హీరో అయినా.. తెలుగులో తనకూ, తన సినిమాలకూ ప్రత్యేకంగా అభిమానులున్నారు. తను కూడా చాలా కాలం నుంచి తెలుగు హీరోగానే చలామణీ అయిపోతున్నాడు. పైగా ఖైదీ, సర్దార్ లాంటి సినిమాలకు మంచి కలక్షన్లు వచ్చాయి. అనూ ఇమ్మానియేల్, సునీల్ లాంటి కాస్టింగ్ ఉండడంతో దాదాపుగా తెలుగు సినిమా అనే ముద్ర పడిపోయింది. ఈ దీపావళికి.. జపాన్ మంచి ఆప్షనే.
జిగర్ తండ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఈ పండగ రేసులో ఉంది. లారెన్స్, ఎస్.జె సూర్య ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు. జిగర్ తాండ తమిళంలో ఓ కల్ట్ గా నిలిచింది. తెలుగులో ఈ సినిమాని గద్దల కొండ గణేష్‌గా విడుదల చేసి మంచి హిట్టు కొట్టారు. ఇప్పుడు డబ్బింగ్ రూపంలో సీక్వెల్ రిలీజ్ కి రెడీ గా ఉంది. ట్రైలర్ టెమ్టింగ్గానే ఉంది. పైగా కార్తీక్ సుబ్బరాజు విషయం ఉన్న దర్శకుడు. సో.. ఈ సినిమాపై కూడా తెలుగు ప్రేక్షకులు గట్టిగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.
సల్మాన్ ఖాన్ `టైగర్ 3` కూడా ఈ పండక్కే వస్తోంది. సల్మాన్ భాయ్ సినిమా అంటే పాన్ ఇండియా స్థాయి క్రేజ్. తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్సుల్లో ఈసినిమాకి మంచి డిమాండ్ ఉంటుంది. ఈమధ్య హిందీ డబ్బింగులు మన దగ్గర బాగానే ఆడుతున్నాయి. ఈ సినిమాలకు తోడుగా స్రవంతి రవికిషోర్ నిర్మించిన `దీపావళి` కూడా ఈ దీపావళికే వస్తోంది. తెలుగు నుంచి పెద్ద సినిమాలేవీ రాకపోయినా… ఈ పండక్కి వినోదానికి మాత్రం ఢోకా లేనట్టే. మరి ఈ సినిమాల్లో లక్ష్మీ పటాసులా పేలేది ఏదో.. బాక్సాఫీసు దగ్గర చిచ్చుబుడ్డిలా వెలిగేది ఏదో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాలి.