నరకాసురుడ్ని వధిస్తే దీపావళి వచ్చింది. ఆ నరకాసురుడు ఎవరు. నరుడ్ని హింసలు పెట్టే… ప్రతి ఒక్కరూ నరకాసురుడే. వాడు మనిషే అవ్వాలని లేదు. నిజానికి మనిషి కాదు. మనిషిలో ఉండే దుష్ట ఆలోచనలే అసలు శత్రువులు. పిచ్చిపట్టినట్లుగా కొంత మందిపై పగబట్టడం… ఓ కులాన్ని అంత చేస్తానని కత్తి తిప్పడం..ఓ రాష్ట్రాన్ని నామరూపాల్లేకుండా చేస్తానని వికటట్టాహాసం చేయడం లాంటివే కాదు.. పక్కోడికి హాని చేసి తాను బాగుపడాలనుకోవడం కూడా నరకాసురుల లక్షణాల్లో ఒకటి. కాస్త లోతుగా ఆలోచిస్తే పురాణాలు.. దీపావళి ఇతిహాసాలు కూడా చెప్పేది ఇదే.
ఏదైనా ధర్మం ప్రకారం నడవాలి. ఏది ధర్మం..ఏది అధర్మం అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. మనకు దేవుడు లేకపోతే ఆ రూపంలో ఉండే ఇతరులు కొన్ని బాధ్యతలు ఇస్తారు. వాటిని సక్రమంగా నిర్వహించడం అంటే.. దైవపని పూర్తి చేసినట్లే. అలా కాకుండా… ఆ పనిని స్వార్థం కోసం చేస్తే.. మనలోని నరకాసురుడు బయటకు వచ్చినట్లే. జరిగినంత కాలం జరుగుతుంది. కానీ ఎప్పటికైనా నరకాసుర వధ జరగాల్సిందే. దీపావళి రావాల్సిందే. ఇది ప్రకృతి ధర్మం.
దీపావళి అంటే.. చెడును వధించి మంచికి పట్టం కట్టడం. ప్రతి మనిషి తనలో ఉన్న నరకాసుర లక్షణాల్ని… వధించి… వీలైనంత వరకూ స్వచ్చంగా మారడమే అసలైన దీపావళి అనుకోవచ్చు. ఎదుటి వారిపై అకారణంగా కులం, మతం, ప్రాంతం ఆధారంగా ద్వేషం పెంచుకోవడం … వాడు కష్టపడి సంపాదించుకున్నా సరే ఈర్ష్య పెంచుకోవడం… బాగుపడ్డవాడిని చూసి బాధపడటం… వంటివివి ఈ కోణాల్లోకే వస్తాయి. ఎదుటి వారికి ప్రేమను పంచి… మంచి కోసం జీవించడమే అసలైన దీపావళి.
ఎవరికీ హాని చేయకుండా.. మంచి కోసం బతుకడమే కాదు.. సమాజం పట్ల … ఇతరుల పట్ల ద్వేషభావంతో వ్యవహరిస్తున్న వారిని… బాధ్యతల్లో ఉన్న వారి దారి తప్పినా .. ఎదిరించడం కూడా కీలకమే. అలా చెడుపై పోరాటం చేసినప్పుడే… తర్వాత దీపావళి వస్తుంది. దీపావళి పండుగ నిగూఢార్థం ఇదే. హ్యాపీ దీపావళి.