కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టిక్కెట్ పై ఇంకా స్పష్టత రాలేదని సమాచారం! ఇదే అంశమై ఆమె అనుచర వర్గంలో చర్చనీయాంశంగా మారుతున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకి ఎంపీ టిక్కెట్ లేదా ఎమ్మెల్యే టిక్కెట్ పక్కాగా ఇస్తారనే ఒప్పందంతోనే చేరారని అనుచరులు అంటున్నారు. కానీ, ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ తరుణంలో ఏదో ఒక స్పష్టత ఇవ్వాలనేది వారి డిమాండ్. ఎంపీ టిక్కెట్టో, లేదంటే ఎమ్మెల్యే టిక్కెట్టో ఏదో ఒకటి స్పష్టంగా చెబితే… దానికి అనుగుణంగా ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుంటామనేది బుట్టా వర్గీయుల అభిప్రాయంగా తెలుస్తోంది.
అయితే, అదే జిల్లాకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. ఆయన కూడా సీట్ల డీల్ తోనే టీడీపీలోకి వస్తున్నట్టు కథనాలు ఈమధ్య వినిపించాయి. కోట్లకు కర్నూలు ఎంపీ స్థానంతోపాటు, మరో మూడు ఎమ్మెల్యే స్థానాలు తనవారికి ఇవ్వాలనేది ఆయన డిమాండ్ గా ప్రచారం జరిగింది. దీంతో కర్నూలు ఎంపీ సీటు బుట్టాకి దక్కుతుందా, లేదంటే కోట్లకు ఇస్తారా అనే సందిగ్ధం నెలకొంది. ఇదే అంశమై స్పష్టత కోసం బుట్టా రేణుక కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించే ప్రయత్నం చేశారట. ఈ మధ్యనే సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఒక రోజు దీక్ష చేస్తున్న సమయంలోనే బుట్టా ఈ అంశంపై మాట్లాడే ప్రయత్నం చేసినట్టు సమాచారం. త్వరలోనే స్పష్టత ఇస్తానని ఆయన చెప్పారని సమాచారం. అయితే, తరువాత నుంచి కర్నూలు ఎంపీ సీటు అంశమై బుట్టా రేణుకతో చర్చించలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ నుంచి తనకు ఫోన్ వస్తుందని బుట్టా ఎదురుచూస్తున్నట్టు చెబుతున్నారు.
ఇంతకీ, ఇప్పుడు బుట్టా రేణుక పార్టీ నుంచి ఎదురుచూస్తున్నది సమాచారం ఏంటంటే… తనకు కర్నూలు ఎంపీ సీటు ఇవ్వకపోతే, దానికి బదులుగా ఏం చేస్తారు అనేది! ఆ క్లారిటీ వచ్చేస్తే తదనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేసుకోవచ్చనేది బుట్టా ఆలోచనగా తెలుస్తోంది. అయితే, ఎంపీ టిక్కెట్ దక్కడం ఎలాగూ అనుమానంగానే ఉంది కాబట్టి, కనీసం ఎమ్మెల్యే సీటు అయినా ఆమె కోరిన చోట ఇవ్వాలనేది అనుచరుల డిమాండ్. మరి, బుట్టా విషయంలో పార్టీ అధినాయకత్వం ఆలోచన ఎలా ఉందనేది ఇంకా తేలాల్సి ఉంది.