తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ముగిసిపోయింది. రాజీనామా చేయడంతో గతవారంగా కొనసాగుతున్న హైడ్రామాకు తెర పడిపోయింది. ఆయన కాంగ్రెస్ చేరతారా.. చేరితే ఎప్పుడూ ఏంటీ ఎలా, చేరాక ఆయనకు దక్కే ప్రాధాన్యత ఏంటీ, ఎన్నికలు వచ్చేనాటికి ఆ పార్టీలో రేవంత్ కు ఏ పాత్ర ఇస్తారు.. ఇక చర్చంతా ఇటువైపు వెళ్లిపోతుంది. కేసీఆర్ పై పోరాటంలో భాగంగా టీడీపీలో కొనసాగే పరిస్థితి లేదంటూ రేవంత్ దూరమయ్యారు. నిజానికి, తెలంగాణలో తెలుగుదేశం ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనే చర్చ దగ్గరే రేవంత్ రెడ్డి ఎలిమినేషన్ రౌండ్ ప్రారంభమైంది. కానీ, ఆ చర్చకు పక్కకు వెళ్లిపోయి.. దాన్ని ప్రతిపాదించిన రేవంత్ ను బయటకి పంపడమే అజెండాగా మారిపోయింది. విదేశాల్లో ఉన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వచ్చాక చర్యలు ఉంటాయనేశారు. ఈలోగా మోత్కుపల్లి, ఎల్. రమణ వంటివారు ఫిర్యాదులపై ఫిర్యాదులు చేసేశారు. కానీ, చివరికి జరిగింది ఏంటీ… పార్టీ నుంచి చాలా మర్యాదపూర్వంగా, ఎంతో ప్రశాంతంగా రేవంత్ రెడ్డి బయటకి వెళ్లే పరిస్థితిని చంద్రబాబే కల్పించారు! రాజీనామా చేసేందుకు కావాల్సినంత వెలుసుబాటు వచ్చారు.
ఈ మొత్తం ఎపిసోడ్ ను ఒక్కసారి పరిశీలిస్తే.. తెలంగాణ తెలుగుదేశం పార్టీపై జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు బాధ్యత ఉందా లేదా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే, రేవంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా ఆయనకి ఏ స్థాయి అభిమానం ఉన్నా అది వేరే అంశం. ఒక రాష్ట్రంలో బలమైన మూలాలున్న పార్టీ నిర్వీర్యం అయిపోతూ ఉంటే అధ్యక్షుడిగా ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యత ఏది..? 15 మంది ఎమ్మెల్యేలతో గత ఎన్నికల్లో నిలిచిన పార్టీ, ఇప్పుడు ఇద్దరికే పరిమితమౌతున్న తరుణంలో చంద్రబాబు చేయాల్సింది ఏంటీ..? పార్టీలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరైన రేవంత్ వెళ్లిపోతుంటే, పార్టీకి జరుగుతున్న నష్టాన్ని గుర్తిస్తున్నారా..? ఆయనతోపాటు కొంత కేడర్ కూడా చేజారిపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఊరకుంటున్నారా..? ఇలాంటి ప్రశ్నలకు వారి దగ్గర ఏ సమాధానం ఉందో వారికే తెలియాలి.
గడచిన ఆర్నెల్లుగా రేవంత్ పక్కచూపులు చూస్తున్నట్టు పార్టీ నేతలకు ముందే తెలుసట! అయితే, ఇన్నాళ్లూ ఏం చేసినట్టు..? ఈ విషయం చంద్రబాబుకి కూడా తెలిసే ఉంటుంది కదా. సరే, ప్రస్తుత రేవంత్ నిష్క్రమణనే తీసుకుంటే… చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చేలోగా పార్టీలో జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. దీన్ని సరిదిద్దుకోవాలంటే తెలంగాణలో మిగిలి ఉన్న టీడీపీ నేతలకు ప్రాధాన్యత పెంచాలి. వారి మాటకు విలువనివ్వాలి. ఆ నమ్మకం వారిలో కలిగించేలా ప్రవర్తించాలి. అంతేగానీ, వచ్చీరావడంతో రేవంత్ ను పక్కన కూర్చోబెట్టుకుని, కూల్ గా రాజీనామా చేసి వెళ్లేంత వెలుసుబాటు కల్పించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? తెలంగాణలో పార్టీ భవిష్యత్తు ఏంటనేది చంద్రబాబు ఆలోచిస్తున్నారా అనే అనుమానం ఆ కేడర్ కు ఇప్పుడు కచ్చితంగా కలుగుతుంది. వెళ్లిపోతున్న రేవంత్ మీదే సింపథీ చూపిస్తున్నారుగానీ, కూలిపోతున్న పార్టీని నిలబెట్టే చర్యలు చేపడుతున్న దాఖలాలు ప్రస్తుతానికి కనిపించడం లేదు.