హైదరాబాద్: మనదేశంలోనేమో 125 కోట్ల జనాభా కారణంగా అనేక సమస్యలతో చస్తున్నాము. కానీ కొన్ని దేశాలలో జనాభా తక్కువై బాధపడుతున్నారు… ముఖ్యంగా యూరప్‌లో. ఈ ఖండంలో పలు దేశాలలో జననశాతం బాగా తగ్గిపోతోంది. దీంతో అక్కడి ప్రభుత్వాలు జనాభాను పెంచటానికి పలు చర్యలు చేపడుతున్నాయి. రష్యా ప్రభుత్వం సెప్టెంబర్ 12ను నేషనల్ డే ఆప్ కన్సెప్షన్(జాతీయ గర్భధారణ దినం)గా ప్రకటించింది. అంటే ఆ రోజున జంటలు పనినుంచి ఆఫ్ తీసుకుని ప్రభుత్వ డ్యూటీగా శృంగారంలో పాల్గొనవచ్చు. ఆ రోజున డెలివరీ అయిన మహిళలకు రిఫ్రిజిరేటర్లు, నగదు, ఇంకా కార్లుకూడా బహుమతులుగా పొందే అవకాశాలుంటాయి. తొలిసారి గర్భవతులైన మహిళలకు ఇటలీ ప్రభుత్వంకూడా అనేక నగదు ప్రోత్సాహకాలు, సేవలు అందిస్తోంది.
ఇక డెన్మార్క్ ప్రభుత్వమయితే పౌరులను ప్రాధేయపడుతోంది… శృంగారంలో ఎక్కువగా పాల్గొనాలని. గత కొన్ని సంవత్సరాలుగా దీనిపై అనేక అవగాహనా కార్యక్రమాలను నడుపుతోంది. అక్కడ పరిస్థితులే దీనికి కారణం. అక్కడ జననాల శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడక్కడ జననాల శాతం 1.7 మాత్రమే. జంటలు హాలీడేకు వెళ్ళొచ్చిన తర్వాత గర్భధారణలు ఎక్కువగా జరుగుతున్నాయని, హాలీడే తీసుకుని ఎక్కడికైనా వెళ్ళాలని ప్రభుత్వం జంటలను అభ్యర్థిస్తోంది. ఈ మధ్యయితే ఈ అవగాహనా కార్యక్రమాలకు సెంటిమెంట్ కూడా జోడిస్తున్నారు. దేశంకోసం, మేజర్లయిన పిల్లలు జంటలతో జతకట్టేవిధంగా ప్రోత్సహించాలని తల్లులను కోరుతూ ఒక యాడ్ క్యాంపెయిన్ ప్రారంభించారు. దాని ట్యాగ్ లైన్ ఇలా ఉంది… ‘డూ ఇట్ ఫర్ డెన్మార్క్ – డూ ఇట్ ఫర్ మామ్’.