తెలుగుదేశం ప్రభుత్వంపై వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపైగానీ, మంత్రి లోకేష్ పైగానీ ఆమె తీవ్రమైన పదజాలం ఉయోగించి విమర్శలు చేస్తుంటారు. రోజా వ్యాఖ్యల్ని తిప్పికొట్టేందుకు టీడీపీ నుంచి కూడా ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉంటారు. అయితే, ఈ మధ్య రోజా వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబడుతూ టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీడియాలో కూడా ఈ కథనాలు ప్రముఖంగా వచ్చాయి. రోజా వ్యాఖ్యలు.. వాటికి టీడీపీ కౌంటర్లు అనేవి పరమ రొటీన్ వ్యవహారం. అయితే, ఈసారి ముద్దుకృష్ణమ వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించినట్టు కథనాలు రావడం విశేషం!
పార్టీ ముఖ్యనేతలతో భేటీ సందర్భంగా గాలి విమర్శల అంశం చర్చకు వచ్చిందట. ఆ సమయంలో కేసీఆర్ స్పందిస్తూ… ఆయన తమ కంటే చాలా సీనియర్ నేత అనీ, తాము శాసన సభకు ఎన్నికైన కొత్తల్లో కొన్ని విషయాలు ఆయన నుంచే నేర్చుకునే వాళ్లమని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన సీనియర్ కాబట్టి, రోజా గురించి అలా మాట్లాడటం సరికాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారట. ఈ విషయాన్ని ఎవరైనా ముద్దన్నకు చెప్పండి అని కూడా సీఎం వ్యాఖ్యానించారు. దీంతో సీఎం సూచన మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆయనకి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ‘రోజాపై మీరు చేసిన వ్యాఖ్యల విషయమై తమ చర్చలో ప్రస్థావనకు వచ్చింద’నీ, ‘ఇదే విషయమై మీతో మాట్లాడమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు, మీ స్థాయిని తగ్గించుకోవద్దని కేసీఆర్ మాటగా చెప్తున్నాన’ని కడియం ఫోన్లో మాట్లాడారట!
ఇన్నాళ్లూ లేనిది.. కేసీఆర్ ఇప్పుడే ఎందుకు జోక్యం చేసుకున్నారు అనేదే ఇప్పుడు చర్చనీయాంశం. నిజానికి, కడియం శ్రీహరి, సీఎం కేసీఆర్, గాలి ముద్దుకృష్ణమ నాయుడు.. వీరంతా గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసినవారే కదా. ఆ చనువుతోనే కేసీఆర్ సూచన ప్రాయంగా ఈ విషయాన్ని గాలికి చెప్పి ఉంటారని తెరాస వర్గాలు అంటున్నాయి. దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. గాలి వ్యాఖ్యల్ని తప్పుబడుతూ.. రోజాకు కొమ్ము కాసే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని కూడా కొంతమంది విశ్లేషిస్తున్నారు.
కడియం ఫోన్ చేసిన సమయంలో గాలి ముద్దుకృష్ణమ స్పందించారట! రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఇలాంటి సర్వ సాధారణమనీ, స్పందించకుండా సైలెంట్ అయిపోతే.. ఎదుటివారు చెబుతున్నవే నిజాలు అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుందని ముద్దుకృష్ణమ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఉన్నట్టుండి కేసీఆర్ ఈ వ్యవహారంపై కామెంట్స్ చేశారంటే.. దీని వెనక ఏదో వ్యూహం ఉంటుందన్న అనుమానలే కాస్త ఎక్కువగా వినిపిస్తున్నాయి.