‘ఆఫీసర్’ సినిమా టైమ్లో అఖిల్ – వర్మ కాంబో బయటకు వచ్చింది. ‘ఆఫీసర్ సినిమా చాలా బాగా వస్తోందని.. అందుకే నాగ్ అఖిల్ నీ… వర్మ చేతుల్లో పెట్టాడని’ వార్తలొచ్చాయి. ఈ సినిమాకి సంబంధించి ట్రైల్ షూట్ కూడా జరిగిందని చెప్పుకున్నారు. అయితే ఇదంతా… కేవలం నాగ్ సినిమాని అమ్ముకోవడానికే అని ఇప్పుడు తేలిపోయింది. ఆఫీసర్ విడుదలై.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కోట్లలో కొన్న సినిమాకి లక్షల్లో వసూళ్లు వస్తున్నాయి. దాంతో.. బయ్యర్లు భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సినిమా పోయినా బెంగ పడక్కర్లెద్దు, అఖిల్ సినిమా ఇస్తాం.. అని ఆశ చూపించి మరీ.. ‘ఆఫీసర్’ని అంటగట్టినట్టు తెలుస్తోంది. ఆఫీసర్ సినిమాని కొనుక్కున్న ఓ పంపిణీదారుడు తెలుగు 360తో మాట్లాడాడు. తన ఆవేదన మొత్తం వెళ్లగక్కాడు.
”నేనేదో లో బడ్జెట్లో ఓ సినిమా తీసుకుందాం అనుకున్నాను. కానీ వర్మ, నాగ్ మనుషులు.. నన్ను జేడీ చక్రవర్తి ఆఫీసుకు తీసుకెళ్లారు. ‘ఆఫీసర్’ కొనుక్కో చాలా బాగుంది.. ఈ సినిమా పోయినా.. అఖిల్ సినిమా ఉంది కదా` అంటూ.. బలవంతంగా ‘ఆఫీసర్’ సినిమా అంటగట్టారు” అని ఆవేదన వ్యక్తం చేశాడు. టీజర్లు, ట్రైలర్లు కూడా నచ్చలేదని, అందుకే సినిమా కొనకూడదనుకున్నానని, కానీ మాయ మాటలతో తనని మభ్యపెట్టారని, ఇప్పుడు పెట్టుబడి లో ఒక్క పైసా కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేదంటున్నాడు ఆ పంపిణీదారుడు. తనకు న్యాయం చేయమని ‘ఆఫీసర్’ చిత్రబృందానికి ఫోన్లు చేస్తున్నా – ఒక్కరూ స్పందించడం లేదని, ఇప్పుడు క్యూబ్ డబ్బులు కట్టమని వేధిస్తున్నారని, ఇలాగైతే ఆత్మహత్యే శరణ్యం అని తన బాధని వెళ్లగక్కుకున్నాడు. మిగిలివాళ్ల పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇంతే. `ఆఫీసర్` సినిమాపై ముందు నుంచీ ఎలాంటి నమ్మకాల్లేవు. ఈ సినిమాని ఎవ్వరూ కొనరని ట్రేడ్ వర్గాలు కూడా ఓ నిర్ణయానికి వచ్చేశాయి. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో బయ్యర్లు దొరికారు. వాళ్లు కూడా అఖిల్ సినిమాపై ఆశతో వచ్చినవాళ్లే. అలా తీయబోయే సినిమాని ఆశ చూపి – తీసిన సినిమాని అమ్మేశారు. టాలీవుడ్ వ్యాపారంలో ఇదో మాయ. అందులో ఈసారి మరికొంతమంది బలయ్యారు. అంతే తేడా.