ఒక్క క్షణం విడుదలకు ముందు కొన్ని ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఈ సినిమా కొరియన్ లో వచ్చిన `ప్యారరల్ లైఫ్`కి కాపీ అనే వాదన వినిపించింది. పర భాషా చిత్రాల్లో పాయింట్‌ని పట్టుకొని సినిమాలు తీసేయడం మన వాళ్లకు బాగా అలవాటు. కాబట్టి… ఈ కాపీనీ పెద్ద మనసుతో స్వీకరించొచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. అదేంటంటే.. సదరు కొరియన్ సినిమాని రీమేక్ చేయడానికి అనిల్ సుంకర ప్లాన్ చేశారు. అందుకు గానూ.. రైట్స్ కూడా కొనుగోలు చేశారు. ఒక్క క్షణం ట్రైలర్ బయటకు వచ్చాక.. తాము రీమేక్ చేయాలనుకుంటున్న సినిమానే.. ఆనంద్ కాపీ చేశాడన్న సంగతి అర్థమైంది. దాంతో… అనిల్ సుంకర కాస్త హడావుడి చేశాడు. ఈ సినిమా విడుదల అవుతుందా, లేదా?? అనే సస్పెన్స్ నడిచింది.
ఆనంద్ కూడా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ”ఇది కొరియన్ కథ కాదు.. చాలా కొత్త కథ” అని గట్టిగా చెప్పే ప్రయత్నం చేశాడు. కాన్సెప్ట్ ఒక్కటే అయినంత మాత్రాన కాపీ అంటారేంటి? అని వాదించాడు. కానీ తీరా సినిమా చూస్తే.. ఇది ‘ప్యారలల్ లైఫ్’ సినిమాకి కాపీ అనే సంగతి అర్థమైంది. అలాంటప్పుడు అనిల్ సుంకర ఎందుకు వదిలేశాడు? అనే డౌటు రావొచ్చు. విడుదలకు ముందే… చిత్రబృందంతో సెటిల్మెంట్ జరిగిపోయిందని, దాని విలువ దాదాపుగా అరకోటికి అటూ ఇటూగా ఉంటుందని తేలింది. చిత్రసీమలో ఇలాంటి సెటిల్మెంట్ వ్యవహారాలు మామూలే. కాకపోతే.. వీఐ ఆనంద్ అబద్దం చెప్పినట్టు అయ్యింది కదా?? ఇది కాపీ కాదన్న ఆనంద్.. ఇప్పుడు మీడియాకు ఎలాంటి సమాధానం చెబుతాడు??