వర్మ అసలే తిక్కలోడు. ఎప్పుడు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తాడో చెప్పలేం. ఎప్పుడు ఎవరి కథ అతన్ని ఆకర్షిస్తుందో అస్సలు ఊహించలేం. ఇప్పుడు సడన్ గా బ్రూస్లీ సినిమా తీసేస్తా.. అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. మనోడు బ్రూస్లీకి వీరాభిమాని. బ్రూస్లీ గురించి వర్మకి తెలిసినన్ని విశేషాలు… ఇంకెవ్వరికీ తెలియవేమో. అలాంటివాడు బ్రూస్లీ సినిమా తీస్తాననడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే సడన్‌గా ఇప్పుడు గుర్తుకు రావడమే విడ్డూరంగా మారింది. బ్రూస్లీ బయోపిక్ తీస్తానని బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ రీసెంట్గా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వర్క్ కూడా మొదలైపోయింది. శేఖర్ కపూర్ స్టేట్మెంట్ చూసి… వర్మ తాను కూడా సిద్ధమైపోయాడు. ‘శేఖర్ కపూర్ తీస్తున్న బ్రూస్లీ సినిమాకి పోటీగా నేనూ ఓ సినిమా తీస్తా. ఆయనెప్పుడు విడుదల చేస్తాడో నేనూ అప్పుడే విడుదల చేస్తా. ఎవరిది బాగుందో మీరే చెప్పండి ‘అంటూ ఓ ట్వీట్ చేశాడు వర్మ.
వర్మ ట్వీట్లని ఎంత సీరియెస్‌గా తీసుకోకూడదనుకొన్నా అందులో ఏదో ఓ పాయింట్ రెచ్చగొడుతూ ఉంటుంది. వర్మ బ్రూస్లీ సినిమా తీయడం నేరమేం కాదు. కాకపోతే… శేఖర్ కపూర్ స్టేట్మెంట్ ఇచ్చిన తరవాత తాను అస్త్రాలు సిద్దం చేసుకోవడం మాత్రం తప్పు. బ్రూస్లీకి వర్మ వీరాభిమానే. కాదనం. ఇప్పటి వరకూ వర్మకి బ్రూస్లీ ఎందుకు గుర్తుకు రాలేదు. బ్రూస్లీపై సినిమా తీస్తాడు సరే.. దాన్ని శేఖర్ కపూర్ సినిమాతోనే ఎందుకు విడుదల చేయాలి..?? బాలీవుడ్లో ఇప్పుడు బయోపిక్‌ల జోరు ఎక్కువైంది. కాసుల వర్షం కురిపించే సత్తా బయోపిక్‌లకు కూడా ఉందన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. బ్రూస్లీ కథలోనూ బోల్డన్ని కమర్షియల్ అంశాలున్నాయి. అందుకే బ్రూస్లీ కథ ఇప్పుడు హాట్ హాట్‌గా ఊరిస్తోంది. శేఖర్ కపూర్ బ్రూస్లీ తీసేస్తే.. తాను కొత్తగా చూపించడానికి ఏం ఉండదు. అందుకే.. శేఖర్ కపూర్‌కి పోటీగా తన బ్రూస్లీని రంగంలోకి దింపుదామనుకొంటున్నాడు. వర్మ సినిమా ఎంత సేపు..?? రెండు నెలల్లో అవ్వగొట్టేస్తాడు. సినిమా చుట్టేయడంలో వర్మ తరవాతే ఎవరైనా.. ఇక శేఖర్ కపూరే జోరందుకోవాలి. వర్మ కేవలం శేఖర్‌కపూర్‌ని రెచ్చగొట్టడానికే ఈ ట్వీట్ చేశాడా, లేదంటే… నిజంగానే బ్రూస్లీ తీసే ప్లాన్లు ఏమైనా ఉన్నాయా..?? ఏంటో వర్మ.. అతని సినిమాలే కాదు, ట్వీట్లూ అర్థం కావు.