పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ నిరాహారదీక్ష చేసిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు వైద్యులు రెండు, మూడు వారాల రెస్ట్ ప్రిఫర్ చేశారు. రెండురోజుల పాటు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా నిరాహారదీక్ష చేయడంతో బీపి, బలహీనత, మైకము వంటివి చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఆమెకు డీహైడ్రేషన్ సమస్యతో పాటు ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉందని వైద్యులు వెల్లడించారు. ఆమె ఆరోగ్యం గురంచి ఆందోళన చెందనక్కర్లేదని వెంటనే చెబుతున్నారు. ఎప్పుడైనా ఆమెను డిశ్చార్జ్ చేసే చాన్స్ ఉంది.
వైఎస్ షర్మిలకు తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్ కండీషన్ తో పాటు ప్రీ-రీనల్ అజోటెమియా కూడా ఉన్నట్లు వైద్యలు తెలిపారు. షర్మిల ఆరోగ్య పరిస్థితి కారణంగా 2 – 3 వారాలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ వివరాలతో షర్మిల ఆరోగ్య పరిస్థితిని హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించారు.తాను చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని, అలాగే అరెస్టు చేసిన వైఎస్సార్ టీపీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల రెండు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేశారు .
ఆస్పత్రిలో కూడా షర్మిల దీక్ష కొనసాగిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే వైఎస్ఆర్ టీపీ వర్గాలు మాత్రం అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. దీంతో షర్మిల దీక్ష విరమించినట్లేనని బావిస్తున్నారు. పాదయాత్రకు ఇంత వరకూ అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు మూడు వారాల విశ్రాంతి రిఫర్ చేశారు కాబట్టి.. మరోసారి కోర్టుకు వెళ్లి పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత యాత్ర ప్రారంభించే అవకాశాలున్నాయని భావించవచ్చు.