తెలంగాణలో భాజపా ఎదగాలని జాతీయ నాయకత్వం కోరుకుంటోంది. కానీ, తెలంగాణకు చెందిన నాయకులు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడానికి భాజపాకి మనసు రావడం లేదు! దక్షిణాదిలో పార్టీ బలపడాలీ… కానీ, బలపడ్డ దక్షిణాది నాయకులను గుర్తించడంలో భాజపాది పక్షపాత ధోరణే అనేది పదేపదే రుజువౌతూనే ఉంది. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డికి కేంద్రంలో కేవలం సహాయ మంత్రి హోదాని మాత్రమే ఇచ్చారు. తెరాసకు తామే ధీటైన ప్రత్యామ్నాయం కాబోతున్నామనీ, రాష్ట్రంలో భాజపా ఎదిగిపోతుందని రాష్ట్రస్థాయిలో పార్టీ నేతలు సవాళ్లు చేస్తుంటే… జాతీయ స్థాయి నాయకత్వం ఇస్తున్న ప్రాధాన్యత అస్సలు కనిపించడం లేదు!
కిషన్ రెడ్డికి సహాయ మంత్రి పదవి ఇవ్వడ కేవలం కంటితుడుపు చర్యగానే కనిపిస్తోంది. కనీసం స్వతంత్ర ప్రతిపత్తి కూడా లేని పదవిని కట్టబెట్టారు. ఈ పదవి కేవలం ఒక అలంకార ప్రాయమే. కేంద్ర కేబినెట్ లో తెలుగువాడికి ఈ మాత్రమైనా ప్రాధాన్యత దక్కిందని సంతోషించాలా..? దక్షణాదిపై మారని ఢిల్లీ వైఖరిని చూస్తూ చింతించాలా..? గత భాజపా హయాంలో తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయకు స్వయం ప్రతిపత్తి హోదా ఉన్న సహాయమంత్రి పదవి ఇచ్చారు. ఆయన సీనియారిటీకి అది కూడా తక్కువే. కనీసం దాన్ని కూడా ఇప్పుడు కొనసాగించలేదు. 2014 ఎన్నికల్లో భాజపా ఇక్కడ గెలిచింది ఒక్క ఎంపీ సీటే. కానీ, ఇప్పుడు నాలుగు స్థానాలు వచ్చాయి. రాష్ట్రంలో తెరాస అత్యంత బలోపేతంగా ఉన్న సమయంలో కూడా నాలుగు ఎంపీలు దక్కించుకుని, రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని అనూహ్యంగా భాజపా పెంచుకున్న పరిస్థితి ఉంది. కానీ, స్థానిక నేతల పోరాటానికి తగిన గుర్తింపు ఎక్కడుంది?
తెలంగాణలో భాజపా ఎదగడానికి కావాల్సిన పునాదులు పడ్డాయని అంతా అనుకున్నారు. ఈ ఉత్సాహాన్ని క్షేత్రస్థాయిలో కొనసాగించాలంటే… తెలంగాణ నాయకులకు భాజపా తగిన ప్రాధాన్యత కల్పించాలి. కిషన్ రెడ్డికి ఇచ్చిన పదవిని చూస్తే… రాష్ట్ర భాజపా నేతలు కూడా మనస్ఫూర్తిగా ఆనందించలేని పరిస్థితి ఉందనే చెప్పాలి. అనుభవం దృష్ట్యా చూసుకున్న కిషన్ రెడ్డికి సముచిత స్థానం దక్కలేదనే చెప్పాలి. నరేంద్ర మోడీ యువ మోర్చా నాయకుడిగా ఉన్నప్పుడు… కిషన్ రెడ్డి కూడా అదే స్థాయి యువ మోర్చా నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు. దేశంలో భాజపా అధికారంలోకి వస్తుందని అనే నమ్మకం ఎవ్వరికీ లేని రోజుల నుంచి ఆయన పార్టీలో పనిచేస్తూ వచ్చారు. అన్నిటికీ మించి… పదవుల కోసం పార్టీలను అవలీలగా మారిపోయే స్వార్థ నాయకులున్న ఈ రోజుల్లో… సిద్ధాంతాలకు కట్టుబడి, దశాబ్దాలుగా భాజపాలో కొనసాగుతున్న నిబద్ధత గల నాయకుడు ఆయన. కేబినెట్ లో మంత్రి పదవి ఇవ్వడానికి ఇంతకంటే గొప్ప అర్హతలున్న నాయకులు ఎంతమంది ఉన్నారు? ఏ రకంగా చూసుకున్నా… ఈసారి కూడా తెలుగు నాయకులకు భాజపా అన్యాయం చేసిందనే అనిపిస్తోంది.