తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఫలితాలు రాజకీయ వాతావరణాన్ని మార్చే పరిస్థితి కనిపిస్తోంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన పాతూరి సుధార్ రెడ్డి, పూల రవీందర్ టీఆర్ఎస్ పార్టీ సభ్యులుగా కొనసాగారు. పాతూరి సుధాకర్ రెడ్డికి శాసన మండలిలో ఛీప్ విఫ్ పదవి ఇచ్చారు కెసీఆర్. పూల రవీందర్ సైతం పార్టీ వాణిని అనేక వేదికల్లో గట్టిగానే వినిపించేవారు. ఇప్పుడు ఇద్దరూ ఉపాధ్యాయుల ఆగ్రహం చవిచూశారు. పట్టభద్రుల కోటా ఎన్నికల్లోనూ చంద్రశేఖర్ గౌడ్ టీఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలిచి గెలుపు ఖాయమనుకున్నారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచిన స్వామిగౌడ్ దేశంలోనే మండలి ఎన్నికల్లో అత్యధిక మెజార్జీ సాధించారు. ఈసారి మాత్రం చంద్రశేఖర్ గౌడ్ భారీ ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. నిరుద్యోగులు, విద్యావంతులకు ప్రభుత్వంపై ఉన్న వ్యవతిరేకత ఈ ఫలితాలకు అద్దం పట్టింది.
పార్లమెంటు ఎన్నికల హడావుడి నడుస్తోంది. 16 సీట్లు సాధించాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్న గులాబీ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చినట్లయింది. ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న టీఆర్ఎస్ కు ఇలాంటి పలితాలు రావడం ఊహించని పరిణామంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఈ ఫలితాల ప్రభావం పడుతుందనే భయం నేతలను వెంటాడుతోంది. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఈ ఓటమిపై సమీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం పై ఉద్యోగుల్లో, మేధావుల్లో , నిరుద్యోగ, విద్యార్ది లోకంలో ఉన్న వ్వతిరేకత ఈ మూడు ఫలితాల ద్వారా స్పష్టమైందని అంచనాకు వచ్చారు.
అందుకే… పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆయన వ్యూహం మార్చబోతున్నారని అంటున్నారు. అయితే.. కేసీఆర్ ఎప్పుడూ.. బుజ్జగించే.. రాజకీయ వ్యూహాలను అమలు చేయరు. ఉద్యోగుల విషయంలో తాను వ్యవహరిస్తున్న తీరు కరెక్టే అనేలా.. ఆయన.. రాజకీయ వ్యూహం అవలంభించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కేసీఆర్ పదహారు సీట్ల లక్ష్యంలో.. ఇప్పుడు… ఓ సవాల్ అయితే వచ్చి పడింది. దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది కేసీఆర్కు బాగా తెలిసిన విషయమే కావొచ్చు..!