ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీల అధినేతల ప్రచారం… తమ సొంత పార్టీల కోసం అన్నట్లుగా సాగడం లేదు. బీజేపీ తరపున నరేంద్రమోడీ వచ్చి…చంద్రబాబుపై నానా విమర్శలు చేసి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అనరు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఆ స్థాయిలో కాకపోయినా… ఏపీకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓ మాదిరిగా అయినా విమర్శించి వెళ్తున్నారు. మామూలుగా రాహుల్ గాంధీ ప్రచార తీరు.. దూషణలు, ఇష్టమొచ్చిన ఆరోపణలతో ఉండదు. నిర్దిష్టమైన ఆరోపణలతోనే సాగుతుంది. దానికి తగ్గట్లుగానే విజయవాడ సభలో ప్రసంగించారు. చంద్రబాబుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ.. వైసీపీ అధినేత జగన్ పై మాత్రం విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డిపై ఎన్నో అవినీతి కేసులు ఉన్నాయని, అవినీతి కేసుల్లో ఉన్న జగన్ అధికారంలోకి వస్తే ఏమీ చేస్తారని… ఆయన ప్రజలను ప్రశ్నించారు.
పేదలకు నెలవారీ ఆదాయం ఇచ్చే న్యాయ్ పథకం గురించి రాహుల్ గాంధీ ఎక్కువ సేపు వివరించారు. ఆ పథకం పేదల జీవితాన్ని మారుస్తుందని హామీ ఇచ్చారు. నెలకు రూ.12 వేలు సంపాదించలేని పేదలు దేశంలో ఉన్నారని, పేదలకు ప్రతి నెల నేరుగా రూ.6వేలు బ్యాంకులో వేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విజయవాడలో జరిగిన కాంగ్రెస్ భరోసా సభలో మాట్లాడుతూ నిరుపేదలకు ఏడాదికి రూ.72వేలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. అబద్ధాలు ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ అబద్దాలు చెప్పి… 2014లో ఓట్లు దండుకున్నారని రాహుల్ విమర్శించారు. భారత్ నుంచి పేదరికాన్ని తరిమికొడతామన్నారు. దేశానికి నిరుద్యోగం పెద్ద సమస్యలా మారిందని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ అబద్ధాలు చెప్పారని రాహుల్ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ విషయంలో… రాహుల్ గాంధీ.. నిర్ధిష్టమైన హామీలు ఇచ్చారు. ఏపీ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని ఆయన మరోసారి ప్రకటన చేశారు. దాన్ని మేనిఫెస్టోలో కూడా పెడతామని ప్రకటించారు. గతంలో తిరుపతిలో ఏ పార్టీలో అధికారంలోకి వచ్చినా.. హోదా ఇస్తామని రాహుల్ చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకుని.. వైసీపీ రాజకీయం చేసే ప్రయత్నం చేసింది. అందుకే.. ఈసారి జగన్ కు ఓటేయవద్దని నేరుగానే పిలుపునిచ్చారని అంటున్నారు. అధికారంలోకి వస్తే రెండురోజుల్లో రైతుల రుణమాఫీ చేస్తామన్నారు. ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ.. గెలవలేదు కాబట్టి.. కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే పార్టీని గెలిపించాలన్నట్లుగా.. రాహుల్ ప్రసంగం సాగిందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.