గొప్పింటి అమ్మాయి – పేదింటి అబ్బాయి – వీళ్ల మధ్య ప్రేమ చిగురిస్తే- మరీ పాత కథైపోయింది కదా? సరే.. ఇదే ఫార్మెట్ని తెలంగాణ నేపథ్యంలో తీస్తే, ముఫ్ఫై ఏళ్ల క్రితం కథగా మారిస్తే..
కొత్త లుక్కు, కొత్త కలరింగూ వచ్చేస్తుంది. ఇప్పుడు `దొరసాని` విషయంలోనూ అదే జరిగింది. దొరసానిని కథగా చూస్తే ధనిక – పేద లవ్ స్టోరీనే. కానీ తెలంగాణ యాస, ముఫ్ఫై ఏళ్లనాటి వాతావరణం, అప్పటి సీరియెస్నెస్ ఇవన్నీ కలగలుపుకుని కొత్తగా ముస్తాబైంది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్, రాజశేఖర్ తనయ శివాత్మిక జంటగా నటించిన సినిమా ఇది. వీళ్లద్దరికీ ఇదే తొలి చిత్రం. కాబట్టి `దొరసాని`పై అంచనాలు మొదలయ్యాయి. పైగా తెలంగాణ యాస, భాష, సంస్కృతి.. ఇవన్నీ పక్కాగా తెరపై ఆవిష్కరించినట్టు అనిపిస్తోంది. ప్రేమ కథకు, కాస్త విప్లవ కోటింగు ఇచ్చే ప్రయత్నమూ జరిగినట్టు డైలాగుల్ని బట్టి అర్థమవుతోంది. ఇక ఈకాలం ప్రేమకథల్లో ఉండాల్సిన లిప్పులాకులంటారా?? అవి కూడా ఉన్నాయన్న హింటు దొరికేసింది. ఆర్ట్, కెమెరా, నేపథ్య సంగీతం ఇవన్నీ బాగానే కుదిరాయి. 2 నిమిషాల ట్రైలర్లో ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నాయి. మరి రెండున్నర గంటల సినిమానీ ఇలానే తీర్చిదిద్దితే… దొరసాని పాసైపోయినట్టే.