రెండేళ్లలో పర్మినెంట్ చేస్తామని మాటిచ్చి.. ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. రెండేళ్లు గడిచిపోయి మూడు నెలలు అవుతోంది. కానీ ఇంత వరకూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పర్మినెంట్ గురించి ప్రభుత్వం సీరియస్‌గా స్పందించడం లేదు. అన్నిరకాల ప్రక్రియలు పూర్తయిపోయాయి. సీఎం ఒక్క సంతకం పెడితే సరిపోతుంది. కానీ పెట్టడం లేదు. కారణం ఏమిటో స్పష్టత లేదు. వారానికోసారి వెంకట్రామిరెడ్డి అనే స్వయం ప్రకటిత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు మీడియా ముందుకు వచ్చి పర్మినెంట్ ప్రక్రియ ప్రారంభమైంది ఎవరూ ఆందోళన చెందవద్దని చెబుతూ ఉంటారు. కానీ ఎప్పుడు అని ఉద్యోగులు మథనపడుతున్నారు.
ఆ పర్మినెంట్ ప్రక్రియ ఎటూ తేల్చకుండానే కొత్తగా ఆ ఉద్యోగులందరికీ వైసీపీ రంగులు వేయాలని డిసైడయ్యారు. అందరికీ డ్రెస్ కోడ్ పెట్టారు. బ్లూషర్ట్, బూడిద ప్యాంట్లతో అచ్చంగా చూస్తే వైసీపీని గుర్తుకు తెచ్చేలా రంగులను డిజైన్ చేసి… దుస్తులను పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి మూడు జతల దుస్తులు ఇస్తున్నారు. ఇక వాటితోనే విధి నిర్వహణలో పాల్గొనాల్సి ఉంటుందన్నమాట. పర్మినెంట్ కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగులకు ఈ డ్రెస్‌కోడ్ కొత్తగా చిరాకు తెప్పిస్తోంది.
వైసీపీకి రంగుల పిచ్చి పరాకాష్టకు చేరిపోయింది. ఎంతంగా అంటే ఇటీవల వికలాంగుల దినోత్సవం రోజున వారికి ఏదో చిన్న ఉపకారం చేస్తూ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో లబ్దిదాులందరి మొహాలకు వైసీపీ రంగులు వేసేశారు. ఇంత దారుణమా అని సోషల్ మీడియాలో చర్చ జరిగినా డోంట్ కేర్. ఇప్పుడు కూడా సచివాలయ ఉద్యోగులకు అదే పని చేస్తున్నారు. ముందూ వెనుకా చూసుకోకుండా.. రంగుల పిచ్చితో ఏపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు విమర్శలు పాలవుతున్నా వెనక్కి తగ్గడం లేదు.