వైసీపీ ఎమ్మెల్సీ, అచ్చెన్నాయుడుపై పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ తన కుటుంబాన్ని రోడ్డున పడేసుకున్నారు. ఆయన తన భార్యతో కాకుండా వేరే మహిళతో విశాఖలో కాపురం పెట్టారు. విషయం తెలిసి ఆయన కూతుళ్లు ఇద్దరూ అర్థరాత్రి పూట ఆ ఇంటికి వెళ్లారు. మీడియాను కూడా తన కుమార్తెలు తీసుకు వచ్చారని తెలియడంతో దువ్వాడ ఇంటి గేట్లు కూడా తీయలేదు. దాంతో తన తండ్రిపై మీడియా ముందు విమర్శలు చేసి.. ఆ కూతుళ్లు వెళ్లిపోయారు.
దువ్వాడ శ్రీనివాస్ నోటికి హద్దు.. అదుపూ ఉండేది కాదు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆయన అరాచకాలకు హద్దే లేదు. ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టి జగన్ అభిమానాన్ని సంపాదించుకున్నారు కానీ ప్రజల్లో మాత్రం ఉన్న పేరు కూడా పోగొట్టుకున్నారు. చివరికి కుటుంబం కూడా దూరమయింది. ఓ మహిళతో సాన్నిహిత్యం పెంచుకుని ఆమెతో నే ఉంటున్నారు. ఈ విషయం తెలిసి ఆయన భార్య … ఎమ్మెల్యే టిక్కెట్ రాకుండా చేయాలనుకున్నారు.
రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన దువ్వాడ వాణి .. జగన్ ను కలిసి ఓ దశలో టిక్కెట్ ఖరారు చేసుకున్నారు. కానీ చివరిలో జగన్ హ్యాండిచ్చి మళ్లీ దువ్వాడ శ్రీనుకే చాన్సిచ్చారు. ఆయన ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇక తన కుటుంబంతో పని లేదనుకుంటున్న దువ్వాడ శ్రీను.. భార్యను వదిలేసి.. పరిచయం అయిన మహిళతోనే ఉంటున్నారు.