పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే కాకినాడ నుంచి పోటీ చేసి తనపై గెలవాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ చేశారు. కాకినాడలో పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ పెట్టిన ఆయన తాను తల్చుకుంటే కాకినాడలో జనసేన ఫ్లెక్సీలు కూడా కట్టలేరన్నారు. పవన్ కంటే తమకు తెగింపు ఎక్కువని… పవన్ మాదిరిగా మాటలు చెప్పనని.. చేతల్లో చూపిస్తానన్నారు. జన్మలో పవన్ తనను బేడీలు వేసి కొట్టలేడని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తానేంటో చూపిస్తానని పవన్ కల్యాణ్‌కు హెచ్చరికలు జారీ చేశారు. బియ్యం స్మగ్లింగ్ చేసి పదిహేను వేల కోట్ల పోగేశానని పవన్ చెబుతున్నారని.. అంత డబ్బు ఉంటే… పవన్ ను కొనేసేవాడినన్నారు.
ప్రెస్ మీట్లో పవన్‌పై ద్వారంపూడి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఒక రాజకీయ వ్యభిచారి అని తాను ఎమ్మెల్యేగా రెండు సార్లు విజయం సాధిస్తే.. పవన్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడని ఎద్దేవా చేశారు. పవన్ పొలిటికల్‌గా జీరో అని.. . ప్యాకేజీ చాల్లేదని వారాహి ఎక్కి తిరుగుతున్నాడని ద్వారంపూడి మండిపడ్డారు. సీఎంగా తాను చాలనని.. తన స్థాయి సరిపోదని మూడు నెలల క్రితం చంద్రబాబుకు మద్దతు పలికాడన్నారు. ఇంతలోనే కత్తిపూడి సభలో మాట మార్చాడని.. సీట్లు కుదరక తనను సీఎం చేయాలని అడుగుతున్నాడని అన్నారు. ప్యాకేజీ కుదరక రోడ్లు పట్టుకుని తిరుగుతున్నావని మండిపడ్డారు. రాజకీయాల్లో కూడా హీరోగా నిరూపించుకోవాలని సవాల్ చేశారు.
మార్చి 14న ఒక మాట.. జూన్ 18న ఒక మాట మాట్లాడతావా? అంటూ పవన్‌పై ద్వారంపూడి మండిపడ్డారు. ఎవడో చెప్పిన మాటలు విని కోతిలా గంతులు వేయవద్దని ద్వారంపూడి హితవు పలికారు. పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది స్పష్టత లేదు కానీ.. ఆయన పోటీ చేసే నియోజకవర్గాల పరిశీలనలో కాకినాడ కూడా ఒకటి అన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఈ క్రమంలో చంద్రశేఖర్ రెడ్డి సవాల్ ను పవన్ పరిగణనలోకి తీసుకుంటే.. వచ్చే ఎన్నికల్లో హై వోల్టేజ్ పోరు జరగడం ఖాయమని అనుకోవచ్చు.