ఏపీని అభివృద్ధిని చేసేందుకు బాధ్యతతో పని చేస్తామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అద్భుతాలు సృష్టించడానికి చేతిలో మంత్రదండం లేదు కానీ, గుండెల నిండా నిబద్దత ఉందని స్పష్టం చేశారు. బాధ్యతల నుంచి పారిపోకుండా అభివృద్ధి కోసం నిరంతం పని చేస్తామని ఉద్ఘాటించారు.
అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లెలో “స్వర్ణ గ్రామ పంచాయతీ” పేరిట నిర్వహించిన గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. గ్రామాభివృద్దికి ఏం చేయాలన్న అంశంలో గ్రామసభ చాలా ముఖ్యమన్నారు. వైసీపీ పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసిందని..కూటమి అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. 13 ,326 గ్రామ పంచాయతీలు బలపడితేనే అప్పులన్నీ తీర్చగలమన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని..అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టేక్కించేది ఒక్క చంద్రబాబు మాత్రమేనని పునరుద్ఘాటించారు.
ఉన్న నిధులను కూడా దారిమళ్లించిన పరిస్థితి గతంలో చూశామని వైసీపీ పాలనపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. గ్రామాలకు ఏం కావాలని చిత్తశుద్దితో ఆలోచిస్తేనే మంచి జరుగుతుందని..రాష్ట్ర అభివృద్ధి, స్వర్ణ గ్రామాలు చేసుకోవాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒకరి అనుభవం , మరొకరి సంకల్పం , మరొకరి విజన్ తో ముందుకు వెళ్తున్నామన్నారు.
అన్నం పెట్టే రైతు బాగుంటేనే అన్ని బాగుంటాయని.. గ్రామాలు పచ్చగా ఉంటేనే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. పార్టీ కోసం పని చేసేందుకు ముందుకొచ్చే ఎవరినీ కూడా వదులుకోనని, తాను మనుషులను కలుపుకునే వ్యక్తి అని తెలిపారు. ప్రజల కోసం కూలీ మాదిరిగా పని చేసేందుకు సిద్దంగా ఉన్నాను..ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటాను.పదవిని బాధ్యతతో నిర్వర్తిస్తానని వివరించారు. ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలన్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదని , అవసరమైతే గుండా యాక్ట్ తీసుకొస్తామని వెల్లడించారు.