ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ మరో ఆరు రోజుల్లో ఉండగా.. కేంద్ర ఎన్నికల సంఘం .. ఉన్నతాధికారుల మీద బదిలీల వేట్లు వేస్తూనే ఉంది. తాజాగా.. ఏకంగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీనే బదిలీ చేసేసింది. సీఎస్ అనిల్ చంద్ర పునేఠాను.. బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో కొత్తగా ఎల్వీ సుబ్రాహ్మణ్యాన్ని నియమించారు. అయితే.. హఠాత్తుగా.. సీఎస్‌ను ఎందుకు తొలగించారన్నదానిపై క్లారిటీ లేదు. వారం కిందట… ఇంటలిజెన్స్ డీజీతో పాటు.. ఇద్దరు ఎస్పీలను బదిలీ చేసినప్పుడు… ఆయన.. ఇంటలిజెన్స్ డీజీని… తప్పిస్తూ.. మిగతా అందర్నీ.. ఎన్నికల కమిషన్ పరిధిలోకి తెస్తూ.. జీవో జారీ చేశారు. వాటిపై విమర్శలు రావడంతో… సీఈసీ పిలిచి వివరణ తీసుకున్నారు.
అయితే.. అప్పుడు సైలెంట్ గా ఉన్న ఈసీ.. ఇప్పుడు.. పోలింగ్ కు కొద్ది రోజుల ముందు… బదిలీ నిర్ణయం తీసుకోవడంపై అధికార వర్గాల్లో అయోమయం ఏర్పడింది. నిన్నటికి నిన్న… డీజీపీ ఠాకూర్ ను.. ఢిల్లీకి పిలిపించి.. ఆయన వద్ద ఉన్న ఏసీబీ డీజీ పోస్టును కూడా తొలగించి మరో ఐపీ ఎస్ అధికారి శంకబ్రత బాగ్చీకి ఇచ్చారు. ఎన్నికల సంఘం చేస్తున్న బదిలీలకు… కారణాలు మాత్రం చెప్పడం లేదు. బదిలీలకు కారణాలు ఉండవని… సీఈవో ద్వివేదీ చెబుతున్నారు. అయితే తొలగించిన అధికారులను మాత్రం.. ఎన్నికలకు సంబంధం లేని పోస్టుల్లో నియమించాలని.. సీఈసీ సూచిస్తోంది. ఓ వైపు..రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు చివరి దశలో ఉన్న సమయంలో… ఈసీ ఆంధ్రప్రదేశ్ విషయంలో… ఇలా వ్యవహరించడం వివాదాస్పదంగా మారుతోంది.
రాష్ట్రంలో ఎన్నో బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అత్యంత దారుణంగా.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. గవర్నర్లు సైతం.. బీజేపీకి ఓటేయమని ప్రచారం చేసే పరిస్థితి ఏర్పడింది. అయినా.. ఈసీ.. బీజేపీ పాలిత రాష్ట్రాల వైపు కన్నెత్తి చూడటం లేదు. బీజేపీకి దగ్గరగా ఉండే పార్టీలు..అధికారంలో ఉన్న చోట కూడా.. ఈసీ ఎలాంటి ఫిర్యాదులకూ స్పందించడం లేదు. కానీ.. ఏపీ విషయంలో మాత్రం.. ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో కూడా.. చెప్పకుండా.. కీలకమైన ఉన్నతాధికారులందర్నీ బదిలీ చేసి పడేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎస్ అనిల్ చంద్ర పునేఠ బదిలీపై.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎన్నికల సంఘం బీజేపీ తొత్తులా మారింది. రేపో, మాపో తనను కూడా అరెస్ట్ చేస్తారని మండి పడ్డారు. ఏ తప్పూ చేయని సీఎస్‌ను బదిలీ చేయడమేమిటని ప్రశ్నించారు. వైసీపీకి ఈసీ సహకరిస్తోందని.. ఆగ్రహం వ్యక్తం చేశారు.