ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అనూహ్యమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార పార్టీపై ఎప్పుడైనా ఓట్ల తొలగింపు ఆరోపణలు వస్తాయి. కానీ.. ఏపీలో మాత్రం.. తమ ఓట్లు తొలగిస్తున్నారని.. అధికార పార్టీనే ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నికల కమిషన్ పత్రాల విషయంలో.. ఫామ్ 7 అంటేనే ఎవరికీ తెలియదు. కానీ… కొద్ది రోజులుగా.. మండలాల వారీగా ఈ ఫామ్ -7ల విప్లవం ఏపీలో నడిచింది. ఫలానా ఓటు తొలగించాలంటూ.. అభ్యర్థించేందుకే ఈ ఫామ్ -7. మండలాల వారీగా తెలుగుదేశం పార్టీ ఓటర్లుగా ఉన్న వారని… వారి సభ్యత్వాల ఆధారంగా గుర్తు పట్టినట్లుగా.. ప్రత్యేకంగా ఆ ఓట్లు తొలగించాలంటూ.. ఆన్లైన్లో ఫామ్-7లు అప్లయ్ చేశారు. అవి ఒక్కో మండలంలో వందలు, వేలు దాటిపోవడంతో.. వ్యవహారం బయటకు వచ్చింది.
చంద్రగిరి నుంచి ఇచ్చాపురం వరకు .. టీడీపీ నేతలకు.. ఈ ఫామ్ -7ల వ్యవహారంలో తమ పార్టీ ఓటర్లను టార్గెట్ చేసినట్లు తెలిసిపోయింది. దీనిపై ఉన్న పళంగా ఆందోళనలు ప్రారంభించారు. వారి వద్ద ఉన్న సమాచారాన్ని.. ఈసీ అధికారులకు అందించారు. ఒక్కో వ్యక్తి నాలుగు ఐదు వందల ఓట్లను తొలగించాలంటూ దరఖాస్తు చేశారు. అయితే అలాంటి వారు.. తాము చేయలేదంటున్నరు. ఇదంతా.. కుట్ర పూరితంగా… జరిగిందని.. ఫిర్యాదులు అందడంతో.. ఏపీ ఎన్నికల అధికారి సీరియస్ అయ్యారు. తప్పుడు ఫామ్-7లు దరఖాస్తు చేసిన వారిపై.. ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. క్రిమినల్ కేసులు పెడుతున్నారు.
ఇప్పటికి ఏపీ వ్యాప్తంగా 45 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. ఇలా దరఖాస్తు చేసిన ఐపీ అడ్రస్లు సేకరిస్తున్నామని, విచారణ జరపాలని పోలీస్ శాఖను కోరామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు మీ సేవా సిబ్బంది హస్తం ఉందని తేలిందన్నారు. మొత్తానికి ఈ ఓట్ల తొలగింపు వెనుక ఎరున్నారనేది.. త్వరలోనే బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయ దుమారం రేగడం కూడా ఖాయమే.