ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో బెయిల్ వచ్చింది. మార్చి 15న ఈడీ కవితను అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత తీహార్ జైల్లో సీబీఐ కూడా కవితను అరెస్ట్ చేయగా… ఆమె జైల్లోనే ఉన్నారు. కిందికోర్టులు కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించగా, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ ముందు వాదనలు హోరాహోరీగా సాగాయి. ముందుగా కవిత తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా… ఈడీ, సీబీఐ తరఫున రాజు వాదించారు. ఆమె ఎక్కడికి పారిపోరు, సాక్ష్యులను బెదిరిస్తే ఇంత వరకు ఎక్కడా కేసు నమోదు కాలేదు అని రోహత్గీ వాదించారు.
అయితే, ఈడీ-సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్రూవర్ గా మారిన వ్యక్తుల స్టేట్మెంట్స్ ను వినిపించారు. కవిత ఆధారాలను ద్వంసం చేశారని… మాగుంట కవితతో ఫేస్ టైంలో మాట్లాడినట్లు చెప్పినా, కవిత ఆ రికార్డు లేకుండా తన ఫోన్ లో డిలీట్ చేశారని వాదించారు. ఆ తర్వాత మాగుంట రాఘవ డీల్ నడిపినట్లు చెప్పటంతో… అప్రూవర్ గా మారిన మాగుంట కొడుకు స్టేట్మెంట్ ను ఎలా పరిగణలోకి తీసుకుంటారని కోర్టు ప్రశ్నించింది. ఇక్కడే దర్యాప్తు సంస్థల లాయర్ మధ్యాహ్నం 2గంటల వరకు సమయం అడగ్గా, అప్పుడు మీ వాదన మారుతుందేమోనంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సెక్షన్ 45 అనేది మహిళలందరికీ వర్తిస్తుంది తప్పా చదువుకున్న వారికి, ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి వర్తించదన్నట్లు చూడటం సరికాదన్నారు.
ఇప్పటికే కేసులో విచారణ పూర్తికావటం, చార్జ్ షీట్స్ ఫైల్ కావటంతో పాటు సెక్షన్ 45ప్రకారం మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలు అని బెంచ్ తీర్పునిచ్చింది. 10లక్షల రెండు పూచీకత్తుతో పాటు పాస్ పోర్టు కోర్టుకు అప్పగించాలని, సాక్ష్యులను బెదిరించరాదని కోర్టు షరతులు విధించింది.
కోర్టు తన తీర్పును ప్రకటించిన నేపథ్యంలో… సాయంత్రం కవిత విడుదలయ్యే అవకాశం ఉంది.