ఢిల్లీ లిక్కర్ స్కాం టార్గెట్ కవితేనని మొదటి నుంచి బీజేపీ నేతలు నేరుగానే చెబుతున్నారు. స్కాం బయటపడినప్పుడు ఓ రేంజ్లో ప్రచారం చేశారు. తర్వాత కాస్త చల్లబడ్డారు. సీబీఐ, ఈడీ విచారణ్లలోనూ ఇప్పటి వరకూ కవిత పేరు బయటకు రాలేదు.కానీ హఠాత్తుగా .. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్టును కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. అందులో కవిత పేరును ప్రస్తావించింది ఈడీ.
సౌత్ గ్రూప్ నుంచి రూ. వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చారని ఈడీ తేల్చింది. ఈ విషయాన్ని అరోరా అంగీకరించారని తెలిపారు. ఈ డీల్‌ను సౌత్ గ్రూప్ నుంచి శరత్ రెడ్డి, కవిత చూసుకోగా.. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమన్వయపరిచారని ఈడీ చెబుతోంది. ఈ మొత్తం స్కాం గురించి బయటకు రాకుండా ఎప్పటికప్పుడు ఫోన్లు వాడారాని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కవిత కూడా ఫోన్లు మార్చారని.. వాటిని దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది.
ఇప్పటికే ఈ కేసులో సీబీఐ ఓ చార్జిషీటు.., ఈడీ ఓ చార్జిషీటు దాఖలు చేసింది. ఎప్పుడూ కవితపేరు వెలుగులోకి రాలేదు. ఇప్పుడు.. హఠాత్తుగా.. దినేష్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు వెలుగులోకి రావడం సంచలనాత్మకం అవుతోంది. సౌత్ గ్రూప్ నుంచి కీలకంగా వ్యవహరించారని చెబుతున్న శరత్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఇక కవితకూ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని భావించవచ్చు. దినేష్ అరోరా అనే మరో సిసోడియా సన్నిహితుడు ఇప్పటికే అప్రూవర్‌గా మారారు.