“మనం ఏది ఇస్తే..మనకూ అదే వస్తుంది !”
.. మనం వేరేవారికి ఏం చేస్తామో తిరిగి అదే మళ్ళీ మనకు జరుగుతుంది. అది మంచి కానీ చెడు కానీ, .గౌరవం కాని అవమానం కానీ, దుఃఖం కానీ సంతోషంకాని, మోసగించటం కానీ మోసపోవటం కానీ, తిరిగి మళ్ళీ మనకు జరిగే తీరుతుంది. ఇది వేదాంతం కాదు..సిద్ధాంతం అంత కంటే కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే. అంటే జీవిత సత్యమన్నమాట. ఒక్క సారి మీ మీ జీవితాల్లో తొంగి చూసుకోండి.. ఖచ్చితంగా మీకు ఈ అంశంపై అవగాహనక వస్తుంది. మనం చేసిన దానికి ప్రతిఫలంగానే మనకు ఏదో జరిగింది.. ఏదో వచ్చిందనే అనిపిస్తుంది. అది నిజమే. వ్యక్తిగతంగానే మనం .. ఏది ఇస్తే.. మనకు అది వస్తుంది. రాజకీయాల్లోనూ అంతే. రాజకీయాల్లో అయితే ఇంకా విస్తృతంగా ఇది జరుగుతుంది. రాజకీయ నాయకుడు తన నిర్ణయాల వల్ల లక్షల మంది జీవితాలను ప్రభావితం చేస్తారు. మరి అలాంటి వ్యక్తి నిర్ణయాలతో మొత్తం వినాశనం అయితే.. రివర్స్‌లో ఎంత తిరిగి ఇవ్వాలి. అలాంటి పరిస్థితులే ఇప్పుడు ఆంధ్రాలో కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టక ముందు నుంచీ ప్రారంభించిన ఓ ఉద్యమం ఇప్పుడు పీక్స్‌కు చేరి రివర్స్ అవుతోంది. ఆయనకు అన్నీ తిరిగి లభిస్తున్నాయి. ఏపీకి ఆయన ఏం చేశారో అదంతా ఆయనకు తిరిగి వస్తోంది. విశేషం ఏమిటంటే ఇంకా పదవిలో ఉండగానే ఇలా రావడం…పదవి పోతే ఆ రిటర్న్ సిద్ధాంతం ఎంత బలంగా ఉంటుందో చెప్పలేం కానీ.. ఇప్పటికైతే.. చాలా స్పష్టంగా… రాష్ట్రానికి , ప్రజలకు, తోటి నేతలకు..రాజకీయానికి ఆయనేమిచ్చారో ఆవన్నీ ఆయనకు తిరిగి రావడం ప్రారంభమయింది. ఈ విషయాన్ని ఆయన గుర్తిస్తారో లేదో తెలియదు. ఆయన పార్టీ నేతలు అంచనా వేస్తారో లేదో చెప్పడం కష్టం. ఎందుకంటే.. ఇప్పుడు వారంతా అధికార మత్తులో ఉన్నారు. అధికారం శాశ్వతం అనే ఊహాల్లో ఉన్నారు. మొత్తం దిగిపోయిన తరవాత కానీ.. అరే మనకు ముందే సూచనలు వచ్చాయి కానీ పట్టించుకోలేదే అని నాలిక్కరుచుకోరు.
పవన్ చెప్పులు చూపించే పరిస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించారా…అదే తిరిగి రావడం అంటే !
తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తీసుకుని కొడతా కొడకల్లారా అని పవన్.. నిజంగానే చెప్పులు చూపించి మరీ మాట్లాడారు. ఆయన అలా మాట్లాడతారని ఎవరూ ఊహించలేదు. కానీ భరించి.. భరించి… ఇక సాధ్యం కాదని తిరగబడితే అలాంటి ఎమోషన్ వస్తుంది. వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటి వరకూ ఆయనకు ఇచ్చారు. ఇప్పుడు ఆయన తిరిగి ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ అందరిలాగే ఓ వ్యక్తి. ఆయనకూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకుని ఉండవచ్చు. అంత మాత్రాన ఆయన క్యారెక్టర్‌ను తప్పు పడతారా ?. అసలు వ్యక్తిగత జీవితంలో ఆయనకు ఉండే సమస్యల గురించి ..విమర్శించే ఎవరికీ తెలియదు. కానీ వారి లక్ష్యం మానసికంగా పవన్ ను దెబ్బతీయడమే. ఎందుకు దెబ్బతీయాలి? పవన్ రాజకీయంగా ప్రశ్నిస్తున్నారు.. ! ఆయన ప్రశ్నించకుండా దెబ్బతీయాలి. అలా చేయాలంటే రాజకీయంగా విమర్శిస్తే చాలు కదా ! అదే ప్రజాస్వామ్యం. కానీ వైసీపీ నేతలకు ప్రజాస్వామ్యం అంటే.. అన్ని హక్కులు తమకు.. రూల్స్ అన్నీ విపక్షాలకు ఉండే ఆట. అందుకే.. రెచ్చిపోయారు. చివరికి పవన్ చెప్పు చూపించి రివర్స్ అయ్యారు. పవన్ కల్యాణ్ ఎవరిని అన్నా అంతిమంగా ఆ చెప్పు చూపించింది ఎవరో అందరికీ తెలుసు. అందుకే జగన్ రెస్పాండ్ అయ్యారు. స్వాతిముత్యం కబుర్లు చెప్పారు. ఇలాంటి వాళ్లా మనకు దశా..దిశా చూపించేంది అని ఆశ్చర్యపోయారు. కానీ ఆయన నటనను చూసి రాష్ట్ర ప్రజలంతా అచ్చెరువొందారు. ఇప్పుడే కోమాలోంచి వచ్చారా అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్న మాటలు చూసి.. ఆహా..అనుకోకుండా ఉండలేకపోయారు. ఎందుకంటే పవన్ కల్యాణ్ ఉత్తినే ఆ మాటలు అనలేదని.. రాష్ట్రమంతటికీ తెలుసు.
రంకులు అంటగట్టి.. పుట్టుకలను ప్రశ్నించారుగా.. అన్నీ తిరిగి వస్తున్నాయి !
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్సీపీ వచ్చాక రాజకీయం హీన స్థితికి దిగజారిపోయింది. రాజకీయ విమర్శలంటే అమ్మలక్కల్ని బండబూతుల్ని తిట్టడం.. కుటుంబాన్ని సోషల్ మీడియాకు ఎక్కించడం.. మార్ఫింగ్‌లు చేసుకోవడం అన్నట్లుగా మారిపోయింది. కొడాలి నాని , వల్లభనేని వంశీ , పేర్ని నాని, రోజా దువ్వాడ శ్రీనివాస్.. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీలో ఉన్న నోరున్న నేతలంతా కంపు కొట్టేవాళ్లే. రాజకీయాలను కలుషితం చేసిన వాళ్లే. వీరు ఎదుకిలా మాట్లాడారు ? . వీరు చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇతర పార్టీల్లోనూ ఉన్నారు. కానీ గతంలో ఎప్పుడూ ఇలా మాట్లాడలేదే .. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు..?. అక్కడే అసలు సమాధానం దొరుకుతుంది. వీరందరి వెనుక ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకు.. విపక్ష పార్టీల నేతల్ని బండ బూతులు తిట్టించడం.. వాటిని విని ఆనందించడం… ఇష్టం. ఓ ప్లీనరీలో రోజా మాట్లాడుతూండగా.. జగన్ సైగలతో .. ఆమె దగ్గరకు వచ్చిన .. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అనే పెద్ద మనిషి.. ” అమ్మాయి … ఇంకా బాగా తిట్టమంటున్నాడు ” అని సందేశం ఇవ్వగానే.. ఆమె తన టాలెంట్ అంతా ప్రదర్శించడం సోషల్ మీడియాలో ఇంకా వైరల్ వీడియోగానే ఉంది. అంత ఎందుకు ఎంతో పవిత్రమైన అసెంబ్లీలో.. పార్టీ నేతలందరూ.. అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్లుగా నేతల్ని బూతులు తిడుతూంటే.. అదో రకమైన నవ్వుతో కనిపిస్తూ ఉంటారు జగన్. మంత్రిగా లేనప్పుడు… చంద్రబాబును, రఘురామకృష్ణరాజును అసెంబ్లీలో అత్యంత అసభ్యరంగా.. తిట్టిన జోగి రమేష్ వ్యవహారం అసెంబ్లీలోనే రికార్డయింది. ఇక చంద్రబాబు సతీమణిని అడ్డగోలుగా తిట్టించి.. రికార్డుల్లో లేదని బుకాయించిన వైనం మీడియాలో కనిపిస్తూనే ఉంది. ఇదంతా ఎవరి ప్రోద్భలంతో చేశారు. ప్రత్యేకంగా సాక్ష్యాలు అవసరం లేదు. బూతు నేతలుగా ప్రసిద్ధి చెందిన వారంతా పాత్రధారులే.. అసలు సూత్రధారి మాత్రం ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తే. ఇక్కడ నిజంగా ఇవాళ నూజివీడు సభలో ఆవేదన వ్యక్తం చేసినట్లుగా మనసులో ఒక్క శాతం ఉన్నా.. తన పార్టీ నేతల్ని ఆయన మొదటే ఆపేవారు. కానీ ఏ డోస్‌లో తిట్టాలో కూడా సందేశాలు పంపే పార్టీ ఆయనది. ఇవన్నీ ప్రజలకు తెలియవని ఆయన అనుకుంటారో లేకపోతే.. తెలిసినా ప్రజలు తమకు మాత్రమే తిట్టే హక్కులు ఇచ్చారని.. భరించాల్సింది మాత్రం ఇతరులేనని రాసిచ్చారని అనుకుంటారో చెప్పడం కష్టం. అయితే ఇప్పుడు అన్నీ తిరిగి వస్తున్నాయి. పవన్ కల్యాణ్ చెప్పు చూపించడం శాంపిలే…నెక్ట్స్ అన్నీ ప్రారంభమవుతాయి… ఎందుకంటే.. ముందుగా చెప్పుకున్న జీవిత సత్యం ప్రకారం.. ఏది ఇస్తే అదే తిరిగి వస్తాయి.
పత్రిక, టీవీ చానళ్లలో కుటుంబాల్లో చిచ్చు పెట్టారు కదా.. ఇప్పుడు తిరిగి వచ్చిందని గుర్తు చేసుకోగలరా!?
క్యాన్సర్‌తో బాధపడే రామోజీ రావు కుమారుడు బలహీనతల్ని ఆసరా చేసుకుని అప్పట్లో సాక్షి పత్రిక ఓ మైండ్ గేమ్ ఆడింది. ఆయనను పత్రికకు ఎక్కించి..కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఎంత రచ్చచేయాలో అంత చేశారు. ఒక్క కుటుంబమేనా…అన్ని రాజకీయ కుటుంబాలపైనా పడ్డారు. చంద్రబాబునాయుడు సోదరుడు అనారోగ్యంతో ఇంట్లో ఉంటే.. ఆయనపైనా అవాకులు చెవాకులు పేలారు. ప్రతి ఒక్కరి కుటుంబంలో గొడవలు పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి ఇటీవల ఎన్టీఆర్ కుమార్తె మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటే ఎంత దారుణమైన రాజకీయం చేయాలో అంతా చేశారు. ఈ రాజకీయం దెబ్బకు కొన్ని కుటుంబాలు చీలిపోయాయి. కానీ ఇప్పుడేం జరుగుతోంది. వైసీపీ అధినేతకు అన్నీ రివర్స్‌లో తిరిగి వస్తున్నాయి. వైఎస్ కుటుంబం చీలిపోతుందని ఎవరైనా అనుకోగలరా ?. అసలు ఊహించడం సాధ్యం కాదు. ముఖ్యంగా జగన్, షర్మిల వేరు వేరు అని ఎవరైనా ఊహించగలరా ? ఇప్పటికీ జగన్, షర్మిల వేర్వేరు కాదని చాలా మంది నమ్ముతారు. ఏదో రాజకీయ వ్యూహం ప్రకారమే ఇలా విభేదాలున్నట్లుగా నటిస్తున్నారని అంటారు. కానీ నిజమేమిటో తెలియాల్సిన వాళ్లకి తెలుస్తుంది. రాజకీయం కోసం తాము గతంలో తాము ఏం చేశారో అది తిరిగి వస్తోందని.. ఇలాంటి పరిణామాలతో విశ్లేషించుకోగలిగే మానసిక స్థైర్యం.. స్థిరత్వం ఉంటే.. అర్థమవుతుంది. కానీ అలాంటిది లేదని.. మనం ఎప్పుడో చెప్పుకున్నారు. కానీ ఇక్కడ కాస్త పరిశీలిస్తే నిజంగానే.. మనం ప్రత్యర్థులకు ఏది ఇచ్చామో మనకు అదే తిరిగి వస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇందు కోసం భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లను ఔపాసన పట్టాల్సిన పని లేదు. మన జీవితంలో జరుగుతున్న పరిణామాలను చూస్తేనే అర్థమైపోతుంది.
ఒకటి.. రెండు కాదు అన్నీ అంతే… కాస్త ప్రశాంతంగా సమీక్షించుకోవాలి అంతే !
ప్రత్యర్థులపై తిట్లు… కుటుంబాల్లో చిచ్చు మాత్రమే కాదు.. ప్రతీ విషయంలోనూ రివర్స్ లో తాము ఏదిచ్చారో అది వస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు.. ప్రభుత్వంపై బురద చల్లడానికి అన్ని రకాల ఫేక్ ప్రచారాలనూ వాడుకున్నారు. చివరికి శ్రీవారి సేవలో తన్మయత్వం చెందాల్సిన ప్రధాన అర్చకుడ్నీ రాజకీయంలోకి లాగారు. పింక్ డైమండ్ దగ్గర్నుంచి ఒకే కుం డీఎస్పీల వరకూ ఎంత చేయాలో అంతా చేశారు. కానీ ఇప్పుడేం జరుగుతోంది. ఆ పేపర్ చూడొద్దు.. ఆ పత్రిక చదవొద్దు.. ఆ టీవీని అసలు చూడొద్దని ప్రజల్ని బతిమాలుకునే పరిస్థితి వచ్చింది. ఇష్టం లేని పత్రికలు.. చానళ్లను బ్యాన్ చేసి చాలా కాలం అయింది. అయినా ఎందుకిలా కంగారు ?. ఎందుకంటే.. గతంలో తాము చేసిన ప్రచారం స్టైల్లోనే ఇప్పుడు రివర్స్‌లో తమకు అందుతోంది. అయితే అప్పట్లో వారు ఫేక్ ప్రచారం చేసి ఉండవచ్చు కానీ.. ఇప్పుడు అసలు నిజం కళ్ల ముందు కనిపిస్తోంది. ఆ నిజం ఎలాగోలా ప్రజలకు చేరుతోంది. దాన్ని చూపిస్తున్న మీడియాపైన విరుచుకుపడుతున్నారు. మీడియా చూపించకపోయినా…బాధలు పడేవాళ్లకు ఖచ్చితంగా తెలుసు. వారేమీ ఇవ్వాలనుకోకకపోయినా విధి ఖచ్చితంగా ఈ బాధలన్నింటికీ .. పరిష్కారం తిరిగి ఇస్తుంది. నాడు శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని లోకేష్ బినామీ అని ప్రచారం చేసి ..చివరికి తాము వచ్చి.. అతనికి బోర్డు పదవి ఇచ్చినట్లుగా… రివర్స్‌లో అన్నీ జరుగుతూనే ఉంటాయి.
ఇవన్నీ శాంపిల్సే.. అన్నీ తిరిగొస్తాయి !
అయితే పవన్ చెప్పు చూపించడం కానీ.. మరొకటి కానీ.. తిరిగి వచ్చాయంటే..అవన్నీ శాంపిల్సే అనుకోవచ్చు. జీవిత సత్యం ప్రకారం అన్నీ తిరిగి వస్తాయి. కాకపోతే కాస్త ఒక రోజు అటూఇటూ తేడా అంతే. ఇప్పుడు అధికారం ఉంటుంది.. అప్పుడు ఉండదు. ప్రతీ ఒక్కరికీ జీవితం అంటే ఏమిటో తెలిసే గుణపాఠాలను.. జీవితం నేర్పుతుంది. వాటిని నేర్చుకుని నేల మీద ఉన్నోడే.. సవ్యంగా ప్రశాంతంగా ఉంటాడు. లేకపోతే… అంచనా వేయడం కష్టం. కానీ ఒక్క సారిగా రివర్స్ ఇవ్వడం ప్రారంభించిన తర్వాత… మొత్తం ఇచ్చే వరకూ ఆపడం… ఆ విధికి కూడా ఇష్టం ఉండదు. ఇప్పుడు అది ప్రారంభస్టేజ్లో ఉంది. తీసుకోవడం తప్ప ఏమీ చేయలేం.!