చివరికి ఏం చేశావు ? .. అనడుగుతాడు తన మిత్రుడ్ని ఓ వ్యక్తి ! ఆ మిత్రుడు గాఢంగా నిట్టూర్చి ” చేసేశానురా.. వాళ్లకి పెళ్లి చేసేశాను ” అంటాడు. ఆ వ్యక్తి పెద్దగా ఆశ్చర్యపోడు.. ఎందుకంటే అంతకు ముందు జరిగిన స్టోరీ అతనికి తెలుసు. ఆ మిత్రుడు తన కూతురు ఓ కుర్రాడ్ని ప్రేమించిందని .. అతనికి ఇచ్చి పెళ్లి చేయకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఆ కుర్రాడు కూడా ఎక్కడా కట్టు తప్పకుండా తమ ప్రేమలో స్వచ్చత ఉంటే మారు మనసు పొందుతాడని అదే పనిగా నిజాయితీగా ప్రేమిస్తాడు. చివరికి అనుకున్నట్లుగా ప్రేమించిన కుర్రాడితో కాకుండా వేరే వ్యక్తితో కుమార్తె పెళ్లి చేసేస్తున్నాడనుకున్నాడు కానీ.. ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో అసలుకే మోసం తెచ్చుకున్నానని చివరిలో గుర్తిస్తాడు. తర్వాత తన అహన్ని .. ఈర్ష్యని పైచేయి సాధించాలన్న ఓ మూర్ఖపు పట్టుదలని పక్కన పెట్టి అంతిమంగా కూతురి జీవితం గురించి ఆలోచిస్తాడు. వాళ్ల పెళ్లి చేస్తాడు ! ఇదంతా ఓ సినిమా స్టోరీ కానీ చెప్పుకుంటే .. తరచి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలోనూ ఎన్నో పోలికలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటికీ ఆ కుటుంబ పెద్ద తరహాలో ఏపీ ప్రభుత్వ అధినేత మనసు మార్చుకోలేదు. అందుకే అమరావతి సినిమా కంటిన్యూ అవుతోంది.
రాజధానిపై ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసిన ఏపీ హైకోర్టు !
అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు తన తీర్పు చెప్పింది. అమరావతి రైతులు వేసిన పిటిషన్లను విచారించి చెప్పాల్సింది చెప్పింది. సీఆర్డీఏ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని తీర్మానించింది. ఓ రకంగా అసాధారణ తీర్పు ఇచ్చింది. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి శాసనపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని ” రిట్ ఆఫ్ మాండమస్ ” ఇస్తూ తీర్పు చెప్పింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ రాజధాని విషయంలో ఎలాంటి చట్టాలు ఇక ప్రభుత్వం చేయలేదు. మాండమస్ రిట్ ను అంతిమ ప్రత్యామ్నాయంగానే కోర్టులు వినియోగించాలనే నిబంధన ఉంది. అమరావతి విషయంలో ఇంతకు మించి రైతులకు న్యాయం చేయడానికి వేరే దారి లేదని హైకోర్టు భావించినట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వ పెద్దలు గతంలో జరిగినవన్నీ గుర్తు పెట్టుకుంటే దీన్నే క్లైమాక్స్‌గా భావించి మారు మనసు పొందుతారు. లేకపోతే మొండి పట్టుదలతో మూర్ఖంగా తాము పట్టుకున్న కుందేలుకు మూడేకాళ్లు అంటే మత్రం అమరావతి వివాద సినిమా మరికొంత కాలం సాగుతుంది.
అమరావతి కోసం రైతుల మొక్కవోని పోరాటం !
అమరావతి రైతులు న్యాయం కోసం ప్రారంభించిన ఉద్యమం 800 రోజులు దాటిపోయింది. దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులున్నాయని.. అమరావతిలోనూ కట్టేస్తానంటూ సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుండి రైతులు రోడ్డున పడ్డారు. ఆయన ఉద్దేశం ఏమిటో కానీ పాతికవేల మంది భూములిచ్చిన రైతుల గుండెల్లో మూడు రాజధానుల పేరుతో అణుబాంబు. అప్పట్నుంచి ఆ రైతులపై కమ్మవాళ్లని ముద్ర వేశారు. పెయిడ్ ఆర్టిస్టులన్నారు. కేసులు పెట్టారు. లాఠీలతో కుళ్లబొడిచారు. అయినా వారు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. తమను అన్యాయం చేయవద్దని వేడుకుంటున్నారు. కానీ ఎవరికీ పట్టడం లేదు. చట్టాలను.. రాజ్యాంగాలను.. న్యాయస్థానాల కళ్లు గప్పి సైతం… రాజధాని తరలించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు.అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని ఆహ్వానించి… అమరావతే రాజధాని అని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించి చివరికి గెలిచాక రైతుల్ని నట్టేట ముంచిన ప్రభుత్వ పెద్దల నిర్వాకానికి వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారు. భూములు ఇచ్చి మరీ రోడ్డున పడ్డా.. మొక్కవోని పట్టుదలతో పోరాడుతున్నారు. కరోనాలు.. ప్రభుత్వ నిర్బంధాలు వారిని ఏమీ చేయలేకపోయాయి. పాలకులు ఎక్కడైనా కనీస బాధ్యతతో ఉంటారు. ప్రజల పట్ల.. రాష్ట్ర ఉన్నతి పట్ల కొంతైనా బాధ్యతతో ఉంటారు. కానీ ఏపీలో అవేమీ ఉండవు. ప్రజల్ని.. రాష్ట్రాన్ని పాతాళంలోకి తొక్కేసినా ఎలాంటి సమస్య లేదనుకుంటారు. అలాంటి ఆలోచనలతో ఉన్న పాలకులతో రైతులు పోరాడారు.
రాజధాని కోసం త్యాగం చేసిన వారిని ఏడిపించారు కానీ నాశనం చేయలేకపోయారు !
ప్రపంచంలో అన్ని చోట్లా తమ భూములు తీసుకోవద్దని రైతులు పోరాటాలు చేస్తూంటారు. కానీ ఒక్క ఏపీలో స్వచ్చందంగా భూమూలు ఇస్తే రోడ్డున పడేశారని ఆందోళనలు చేస్తున్నారు. రోజులు కాదు.. వారాలు కాదు… నెలల తరబడి చేస్తూనే ఉన్నారు. ఇవాళ్టికి అమరావతి రైతుల ఉద్యమానికి 800 రోజులు దాటిపోయాయి. రాజధానికి భూములిచ్చిన వారంతా టీడీపీ వాళ్లేనని.. వారంతా ఒకే సామాజికవర్గం వారని ప్రచారం చేశారు. అందరూ.. డబ్బులో పుట్టి.. డబ్బులో పెరిగినవారేనని కూడా చెప్పుకున్నారు. కానీ అక్కడ వందల ఎకరాలు ఉన్న భూస్వాములు ఎవరూ లేరు. కనీసం పాతిక ఎకరాలు ఉండే.. ధనవంతులు ఒక్క శాతం కూడా ఉండరు. ఒకటి నుండి.. ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులే తొంభై శాతం మంది ఉన్నారు. ప్రభుత్వానికి 33, 771 ఎకరాలను రాజధాని కోసం రైతులు ఇచ్చారు. ఇలా ఇచ్చిన రైతుల సంఖ్య 29754. అంటే.. దాదాపుగా ఒక్కొక్క రైతు.. ఒక్కొక్క ఎకరానికి కొద్దిగా ఎక్కువ మాత్రమే సగటున ప్రభుత్వానికి ఇచ్చారు. 29 గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. ఇంకా డీటైల్డ్ గా చూసుకుంటే.. ఒకటి నుంచి రెండున్నర లోపు ఎకరాలను అమరావతి కోసం త్యాగం చేసిన రైతులు 6,278 మంది, రెండున్నర నుంచి ఐదు ఎకరాల్లోపు ఇచ్చిన వారు 2,131 మంది, ఐదు నుంచి పది ఎకరాలలోపు ఇచ్చిన వారు 765 మంది. పది నుంచి ఆపై ఎకరాలు ఇచ్చిన వారు వందల్లో కూడా లేరు. 69 శాతం మంది రైతులు ఎకరంలోపు ఇచ్చారు. వీరంతా..నిరుపేద రైతులు. భూములు ఇచ్చినవారిలో 90 శాతం మంది రెండున్నర ఎకరాలలోపు ఉన్నవారే. వీరిని మధ్యతరగతి కేటగిరి కింద వేయవచ్చు. కేవలం 3.3 శాతం మంది మాత్రమే.. ఎగువ మధ్యతరగతి, ధనికవర్గాలు. సామాజికపరంగా చూసుకుంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు 75 శాతం ఉన్నారు. మిగిలిన పాతిక శాతంలో కమ్మ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ వంటి అగ్రకులాలకు చెందినవారున్నారు. కానీ అందరి మీద కమ్మ ముద్ర వేశారు. వేధించారు. చివరికి కేసులు పెట్టారు. రైతులు అన్నింటినీ భరించారు. కన్నీరు పెట్టుకున్నారు వెనుకడుగు వేయలేదు.. ప్రభుత్వం వారిని ఏమీ చేయలేకపోయింది.
సొంత రాష్ట్ర రాజధానిని రాజధానిగా చూడలేని పాలకుల కబోధితత్వం !
అమరావతి ఎవరిది..?… అందరిదీ. అసెంబ్లీలో ఆమోదించారు. ఐదేళ్ల పాటు మరో ఆలోచన ఎవరికీ రాలేదు. ఎన్నికల్లోనూ రాకండా అందరూ ముక్త కంఠంతో అమరావతే రాజధాని అన్నారు. కానీ ఇప్పుడేమయింది. అమరావతిపై ఓ ముద్ర వేసి.. రాజకీయ ప్రయోజనాలు సాధించేశారు స్వార్థ రాజకీయ నాయకులు. దేశంలో ఏ రాజధానిపైనా వేయని నిందలు వేశారు. అది కూడా సొంత ప్రజల్ని మభ్య పెట్టి. ఇతర రాష్ట్రాలు.. ఇతర దేశాలు అభివృద్ధి కోసం.. కలసి కట్టుగా ప్రయత్నిస్తాయి.. కానీ ఏపీలో మాత్రం.. కులం, ప్రాంతాలను బూచిగా చూపి.. ఒకరి ఆర్థిక పునాదుల్ని మరొకరు కూల్చుకుంటూ ఉంటారు. ఆక్రమంలో అమరావతి నిర్వీర్యమైపోయింది. సొంత రాష్ట్ర రాజధానిని పాలకులే విషం పెట్టి చంపేసినట్లయింది. అమరావతి ఓ కులానిదేనని వైసీపీ నేతలు.. ప్రజల్లోకి చర్చ పెట్టారు. సోషల్ మీడియాలో గ్రూపుల ద్వారా.. ఈ భావాన్ని విస్తృత పరిచారు. ఐదేళ్ల పాటు .. ఈ ప్రచారం జరిగింది. ఎంతగా జరిగింది అంటే.. అమరావతి .. ఏపీ రాజధాని కాదు.. అమరావతి అభివృద్ది చెందితే.. బాగుపడేది కూడా.. ఒక్క సామాజికవర్గం వారే లేకపోతే..రెండు జిల్లాల వారేనని నమ్మేలా చేశారు. అయినా రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు.
అమరావతి పీక నొక్కపోతే ఇప్పుడది కల్పతరువు అయి ఉండేది !
అమరావతి విషయంలో గత ప్రభుత్వం పక్కా ప్రణాళికలు వేసుకుంది. ఎప్పుడెప్పుడు ఎంతెంత ఖర్చు పెట్టాలి.. ఎలా నిధుల సమీకరణ చేయాలన్న అంశాలపై.. ఓ బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంది. ఈ మేరకు అమరావతి ఫైనాన్షియల్ ప్లాన్ గురించి ఫిభ్రవరి 2019లో టీడీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 50ను విడుదల చేసింది.ఈ ప్లాన్ ప్రకారం… అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు 55,343 కోట్లు. ఇందులో రాబోయే 8 ఏళ్లలో ఖర్చు పెట్టాల్సింది కేవలం రూ. 6629 కోట్లు మాత్రమే. పెట్టే పెట్టుబడికి.. కొన్ని వందల రెట్ల ఆదాయం అమరావతి నుంచి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ జీడీపీ పెరుగుతుంది. అది రెండు, మూడు లక్షల కోట్ల ఆదాయం వస్తుందన్న అంచనాలున్నాయి. కానీ.. ప్రస్తుత ఏపీ సర్కార్.. మాత్రం రాజధానిపై పెట్టే ఖర్చును గోడకు కొట్టిన సున్నంగా ప్రచారం చేయడానికి ప్రాధాన్యం ఇస్తోంది. రాజకీయ కారణాలో.. సామాజిక కారణాలో కానీ.. జగన్మోహన్ రెడ్డి అమరావతిని నిర్వీర్యం చేయాలనుకోవడం వల్ల దేశం మొత్తం నష్టపోతోందన్న అభిప్రాయం.. అందుకే వస్తోంది. రాజధానిని మొదటి నుంచి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గా చెబుతూ వస్తున్నారు. భూములకు మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత.. వాటి విలువ పెరుగుతోంది. అప్పుడు .. ప్రభుత్వానికి మిగిలే భూమితో సంపాదించుకునే ప్రణాళికలను ఆ జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అమరావతి పీక నొక్కడాన్ని ప్రఖ్యాత ఆర్థికవేత్తలు.. బిజినెస్ మీడియాకూడా.. తప్పు పట్టింది. మొదటి బడ్జెట్లో అమరావతికి కేవలం ఐదు వందల కోట్లు మాత్రమే ఇచ్చిన వైనం.. ఆ తర్వాత సింగపూర్ తో ఒప్పందం రద్దు చేసుకోవడం వంటి ఆంశాలపై.. బిజినెస్ నిపుణులు తీవ్రంగా స్పందించారు. మోహన్ దాస్ పాయ్ లాంటి పారిశ్రామికవేత్తలు.. శేఖర్ గుప్తా లాంటి జర్నలిజం దిగ్గజాలు కూడా..అమరావతిపై జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. కానీ అమరావతి పీక నొక్కడం మాత్రం ఆపలేదు.
ఏమీ చేయలేకపోయారు.. ఇకనైనా రియలైజ్ అవుతారా..? మూర్ఖంగా ముందుకెళ్తారా ?
అమరావతిని ఏదో విధంగా నిర్వీర్యం చేయాలని సీఎం జగన్ అనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. ఆనేకానేక ప్రయత్నాలు చేశారు. అందులో అత్యంత దారుణమైన ప్రయత్నాలు చేశారు. రైతుల్ని ఎడిపించారు. న్యాయస్థానాలు చుట్టూ తిరిగారు. చివరికి చట్టాలను కూడా ఉల్లంఘించి బిల్లులు తెచ్చారు. కానీ ఆ బిల్లులు నిలబడవని తెలిసి వెనక్కి తగ్గారు. ఇప్పుడు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది . రైతుల హక్కులను కాపాడాలని తేల్చేసింది. ఇప్పుడైనా సీఎం జగన్ మానసు పొందుతారా ? అమరావతి విషయంలో జరిగిందేమోటో ఓ సారి చూసుకుని ఆత్మావలోకనం చేసుకుంటారా ? తనకు ఇన్ని ఎదురు దెబ్బలు ఎలా తగిలాయో విశ్లేషించుకుంటారా ? అలా విశ్లేషించుకుంటే తప్పొప్పులు తెలుస్తాయి. దిద్దుకునే అవకాశం ఉంటుంది. దిద్దుకంటే మెరుగుపడతారు.. లేదంటే మరింత దిగజారిపోతారు.