“ఊరి చివరి ఇంటికి నిప్పంటుకుంటే ముందుగా తన ఇంటిపై నీళ్లు పోసుకునేవాళ్లను ఏమంటారు ? . ఆ నీళ్లేదో నిప్పును ఆర్పడానికి ప్రయత్నిస్తే తన ఇంటి వరకూ రాదు కదా అని ఆలోచించలేని వారిని ఏమంటారు ? ” పచ్చి స్వార్థపరులు అంటారు. చివరికి ఆ స్వార్థం వారిని ముంచేస్తుంది. కాల్చేస్తుంది. ఇది ఒక్క నిప్పు విషయంలోనే కాదు అన్నింటిలోనూ వర్తిస్తుంది. కరోనా వైరస్ విషయంలోనూ వర్తిస్తుంది. వ్యాక్సిన్ విషయంలో పేద దేశాలను నిర్లక్ష్యం చేసి.. తమ ప్రజలకు బూస్టర్ డోసులిచ్చేసినా దేశాలు ఇప్పుడు… వ్యాక్సినేషన్ జరగని ఆఫ్రికా నుంచి వెలుగు చూసినా ఒమిక్రాన్ వేరియటం దెబ్బకు తమ దేశాలకు మళ్లీ నిప్పు అంటుకుందని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు.
ప్రపంచం అంతా “ఒమిక్రాన్” అలజడి !
కోవిడ్ కొత్త రకం ‘ఒమిక్రాన్’ ప్రపంచ దేశాలను ఠారెత్తిస్తోంది. రెండేండ్ల క్రితం బయల్పడిన కోవిడ్-19 అతలాకుతలం చేయగా రెండవ ఉధృతిలో డెల్టా వేరియంట్ సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఆ ఉపద్రవం నుండి ప్రపంచం పూర్తిగా కోలుకోకమునుపే దక్షిణాఫ్రికాలో బి.1.1.529 రకం వెలుగు చూసింది. అసాధారణ మ్యుటేషన్ల కలయికగా ఒమిక్రాన్‌ను వైద్య పరిశోధకులు పేర్కొనడమే కాకుండా డెల్టా వేరియంట్ కంటే అత్యంత ప్రమాదకారి అని ప్రాథమికంగా నిర్థారించారు. దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ స్వల్ప సమయంలోనే ప్రపంచం మొత్తం విస్తరిస్తోంది. ఇండియాలోనూ కేసులు నమోదయ్యాయి. అమెరికాలోనూ వెలుగు చూసింది. కరోనా మొదటి వేవ్ సమయంలో సరైన జాగ్రత్తలు చెప్పక వినాశనానికి కారణం అయిందని విమర్శలు ఎదుర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్‌ను ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించి అంతర్జాతీయ ప్రయాణాలపైన కఠిన ఆంక్షలు విధించాలని, వైరస్ కట్టడి చర్యలు చేపట్టాలని, వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని సూచించింది. రెండో దశలో ప్రపంచాన్ని గడగడలాడించిన డెల్టా వేరియంట్లో రిసెప్టర్ బైండింగ్ డొమైన్లో రెండే ఉత్పరివర్తనాలు కనిపించాయి. దానికే ప్రపంచం అల్లకల్లోలం అయింది. అదే యాభై ఉంటే ఇక తట్టుకోవడం సాధ్యమా అని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటి వరకూ వ్యాక్సిన్లేసుకున్నాం ..మాకేంటి అనే తెగింపు !
ప్రపంచంలో అన్ని దేశాలు వ్యాక్సిన్లు వేసుసుకుని ఇక కరోనా వల్ల మాకేం కాదని జబ్బలు చరుచుకుంటున్న దశలో వచ్చి పడింది ఒమిక్రాన్. కరోనా అంటే అందరూ ఇప్పుడు తేలిగ్గా తీసుకుంటున్నారు. వస్తుంది.. పోతుంది అని ఫిక్సయిపోతున్నారు. కారణం వ్యాక్సిన్లు. కానీ ఇప్పుడు వస్తుంది .. తీసుకెళ్తుంది అనే స్థాయి మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇది మాములు వైరస్ కాదు.. సూపర్ డేంజర్ అని భయపెట్టేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో మొదటగా ఈ వైరస్ రోగనిరోధక వ్యవస్థ పని చేయని, చికిత్స పొందని హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగి నుంచి వేరియంట్ వ్యాపించిందని గుర్తించారు. వ్యాక్సిన్ల ద్వారా శరీరంలో ఉండే యాంటీబాడీలు, గతంలో కరోనా సోకిన వారికి ఉండే యాంటీబాడీలు అన్నింటినీ కొత్త వేరియంట్ లొంగ దీసుకుంటోందనేది శాస్త్రవేత్తల ప్రాథమిక విశ్లేషణ. వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వారిపై ఒమిక్రాన్ దాడి చేయవచ్చు. అంతే కాదు ఒకసారి ఈ వేరియంట్ సోకిన వారికి మళ్లీ మళ్లీ సోకే ప్రమాదం కూడా పొంచి ఉంటుందని ప్రపంచ వైద్య నిపుణులు అంటున్నారు.
పేద దేశాల ప్రజలకు వ్యాక్సిన్లు అందకుండా చేసిన ధనిక దేశాల స్వార్థం !
కరోనా ప్రపంచంపై పడిన తర్వాత అందరూ వ్యాక్సిన్ గురించి పరిశోధన చేశారు. చివరికి కనిపెట్టారు. అయితే పేద దేశాలకు వ్యాక్సిన్లు అందలేదు. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల ప్రజల్లో తక్కువగానే వ్యాక్సిన్లకు నోచుకున్నారు. ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా సార్లు ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ధనిక దేశాలు తమ ప్రజల్ని రక్షించుకునేవరకే ఆలోచించాయి. అభివృద్ధి చెందిన టెక్నాలజీని, అందుబాటులో ఉన్న నిధులను కరోనా కట్టడికి స్వేచ్ఛగా ఉపయోగించి ఉంటే ఈ సరికే ప్రపంచంలోని ప్రజలందరికీ పూర్తిగా కోవిడ్ వ్యాక్సినేషన్ జరిగి ఉండేది. వ్యాక్సిన్లను అధిగమించే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయన్న భయం ఉండేది కాదు. ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు గాడిన పడేవి. కానీ పేటెంట్ హక్కుల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ టెక్నాలజీని తమ వద్ద బందీగా ఉంచుకున్న బహుళజాతి సంస్థలు టెక్నాలజీని పేద, మధ్య ఆదాయ దేశాలకు అందకుండా అడ్డుకున్నాయి. వ్యాక్సిన్లు తయారు చేసే సంస్థల నుండి సేకరించి పేద దేశాలకు అందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన ‘కోవాక్స్’ పథకానికి సరిపడా నిధులివ్వకుండా బిగపట్టాయి. చివరికి ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ డోస్‌లను కూడా డబ్బుతో పెద్ద ఎత్తున కొనుగోలు చేసి పేద దేశాలకు అందకుండా చేశాయి. తమ దేశాల్లో పౌరులకు వ్యాక్సిన్ డోస్‌లు వేయగా మిగిలిపోయిన డోస్‌లు వ్యర్ధమవుతున్నాయి గానీ పేద దేశాలకు మాత్రం అందడంలేదు. ఫలితంగా పేద దేశాల నుంచి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి.
ఆఫ్రికా ప్రజలకు అందని వ్యాక్సిన్.. ఫలితమే కొత్త వేరియంట్ ఆర్భావం !
ప్రపంచ జనాభా 790 కోట్లు. ప్రపంచం లోని ప్రతి 100 మంది జనాభాకూ 77 మందికి ఒక్క డోస్ వ్యాక్సిన్ అందింది. ఒక్క డోస్ వేస్తే పూర్తి వ్యాధి నిరోధకత రాదు. అందువల్ల పూర్తి వ్యాధి నిరోధకత రావాలంటే ప్రపంచంలోని పెద్దలు, పిల్లలు అందరికీ కలిపి 90 శాతం మందికి రెండు డోస్‌లు వేయాలి.ప్రతి 100 మంది ప్రజలకు 180 డోస్‌లు వేసిన దేశం పూర్తిగా వ్యాధి నిరోధకత సాధించినట్లు లెక్క. ఒక్క దేశంలో పూర్తి వ్యాధి నిరోధకత వస్తే సరిపోదు. ప్రపంచమంతా రావాలి. ఎందుకంటే ఏ ఒక్క దేశంలో పూర్తి వ్యాధి నిరోధకత రాకపోయినా ఆ దేశంలో ప్రబలిన కోవిడ్ వైరస్‌లో ప్రస్తుత వ్యాక్సిన్లకు లొంగని కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయి. ఈ కొత్త వేరియంట్లు తిరిగి ప్రపంచమంతటా వ్యాపిస్తే మళ్లీ వాటి వ్యాప్తిని నిరోధించడానికి కొత్త వ్యాక్సిన్లు తయారు చేయాలి. మళ్లీ ప్రపంచ ప్రజలందరికీ వాటిని వేయాలి. అంటే మళ్లీ కొత్త చక్రం ప్రారంభమవుతుందన్న మాట. ఇప్పుడు అదే జరుగుతోంది. చైనాలో మొదటి సారి కరోనా బయటపడిన తర్వాత ప్రపంచ ఆర్థిక, ఆరోగ్య, సామాజిక రంగాల్లో సృష్టించిన బీభత్సం అంచనా వేయడం కష్టం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నో మాటలు చెబుతోంది. అందరికీ వ్యాక్సిన్ అందించాలని సూచిస్తోంది. కానీ ఇప్పటికీ మొత్తం ప్రపంచ జనాభాలో 30 శాతం మందికి మాత్రమే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరిగింది. ధనిక దేశాలు ఇతర వ్యాక్సిన్ సంస్థల నుండి వ్యాక్సిన్‌ను కొనేసి నిల్వ పెట్టుకుని తమ దేశ పౌరులకు మాత్రమే ఉపయోగించడం వల్ల అవి వ్యాక్సినేషన్లో ఇతర దేశాల కన్నా ముందున్నాయి. అమెరికా బ్రిటన్ , ఫ్రాన్స్ , జర్మనీ , జపాన్ , కెనడా , ఇటలీ అరవై శాతానికిపైగా డబుల్ డోస వ్యాక్సినేషన్ చేశాయి. ఇవన్నీ జి7 దేశాలు. ఐరోపా లోని మిగిలిన ధనిక దేశాలు కూడా చాలా వరకు 50 శాతం పైగా పౌరులకు పూర్తి వ్యాక్సినేషన్ చేశాయి. ధనిక దేశాల్లో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరగగా… పేద దేశాలైన ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా ఖండాల్లోని పేద దేశా పరిస్థితి మరీ ముఖ్యంగా ఆఫ్రికా లోని అనేక దేశాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నైజీరియాలో ఒక్కశాతం మందికి కూడా వ్యాక్సినేషన్ జరగలేదు. ఆఫ్రికాలోని 54 దేశాల్లో 10 శాతం ప్రజలకు పూర్తి వ్యాక్సిన్ వేయలేకపోయారు. ఫలితమే ఇప్పుడు కొత్త వేరియంట్ ఆవిర్భావం.
ఇల్లు అంటుకుంది .. ఇప్పుడు అందరూ అనుభవించాలి !
ప్రపంచ దేశాలు ఇప్పుడు మళ్లీ ముప్పులో పడ్డాయి. తమ స్వార్థానికి.. తమకు మాత్రమే రక్షణ చాలనుకున్న స్వార్థానికి తామే బలవుతున్నాయి. మళ్లీ లాక్ డౌన్ బాట పడుతున్నారు. ఆంక్షలు విధిస్తున్నారు. దీని వల్ల అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోతుంది. ఇది ఒక్క దేశం సమస్య కాదు. ప్రపంచం మొత్తానిది. అందుకే ధనిక దేశాలు …లీడ్ తీసుకుని సమస్యపై పోరాటం చేసి.. అంతం చేయాలి కానీ.. తమ వరకూ చూసుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది.