” ప్రజాస్వామ్యం అంటే ప్రజలు పాలకుల్ని ఎన్నుకుంటారు.. కానీ దురదృష్టవశాత్తూ ఇలా ఎన్నికయిన వారంతా ప్రజాస్వామ్య నియంతలుగా మారుతూంటారు ” . అధికారం తమ చేతికి అంతే వరకూ ప్రజాస్వామ్యం నాలుగు కాళ్లు మీద నడవాలని కోరుకుటారు. కానీ తమ చేతికి అందిన తర్వాత ఏ ఒక్కరికీ ప్రజాస్వామ్య హక్కులు ఉండకూడదనుకుంటారు. కాలం గడిచేకొద్దీ భారత్ లాంటి దేశాల్లో ఈ ప్రజాస్వామ్య నియంతలు బలపడుతున్నారు. వ్యవస్థల్ని అడ్డగోలుగా ఉపయోగించుకుని విపక్షాల్ని లేకుండా చేసి ఏకఛత్రాధిపత్యం వహించాలనుకుంటున్నారు. ఇందు కోసం ఏం చేస్తున్నారో కూడా కనీసం ఆలోచించలేనంత దిగువ స్థాయికి దిగజారిపోతున్నారు. దానికి తాజా సాక్ష్యం. రాహుల్ గాంధీపై అనర్హతా వేటు.
పాకిస్థాన్ తరహా ప్రజాస్వామ్య విలువల దిశగా భారత్ !
భారత్ – పాకిస్థాన్ ఒకప్పుడు ఒకటే. దేశ విభజన జరిగింది. రెండు దేశాలు అయ్యాయి. ఆ తర్వాత పాకిస్థాన్ కూడా రెండు దేశాలయింది. ఆ విషయాలన్నీ పక్కన పెడదాం. పాకిస్థాన్‌లోనూ ప్రజాస్వామ్యమే ఉంది. కానీ ఎలాంటి ప్రజాస్వామ్యం ఉంది. నిన్నామొన్నటిదాకా ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హతా వేటుకు గురయ్యే ప్రమాదంలో ఉన్నారు. జైలు శిక్ష పడింది. జైలుకెళ్లడమే మిగిలింది. ఒక్క ఇమ్రాన్ ఖాన్ మాత్రమేనా … ముషారఫ్.. నవాజ్ షరీఫ్ ఇలా అందరూ.. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నవారే…. ఎదుర్కోవడమే కాదు.. సృష్టించిన వారు కూడా. అక్కడి కోర్టులు ఎవరికి ఎప్పుడు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తాయో చెప్పడం కష్టం. ఓ కోర్టు ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తుంది. మరో కోర్టు తీసేస్తుంది. ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టు పవర్స్‌ను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అక్కడ ఉన్నది ప్రజాస్వామ్యమే అధికారంలో ఉన్న వారు ప్రత్యర్థుల్ని ఎలిమినేట్ చేయడానికి ఆ ప్రజాస్వామ్యాన్ని చీలిక పేలికలు చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టారు. ఇండియాలో ఆ పరిస్థితి రాలేదు కానీ.. ప్రస్తుతం ఎదురవుతున్న పరిణామాలు చూస్తే.. మనం కూడా అదే దారిలో ఉన్నామని అనుమానించక తప్పదు. అవినీతి పరులు రాజ్యమేలుతున్నారు. కొన్ని పార్టీల్లో చేరితే అవినీతి కేసులు ఉండవు. ఇప్పుడు హత్య కేసులో నిందితుల్ని కూడా రక్షిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నారు. విపక్షనేతల్ని ఎలిమినేట్ చేయడానికి ఎన్ని రకాల వ్యూహాలు పన్నుతున్నారో చెప్పాల్సిన పని లేదు. చివరికి రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేశారు. నిజానికి అది అనర్హతా వేటు వేయాల్సినంత కేసా ? ఆ కేసు.. నేపధ్యం.. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి నియామకం.. ఇతర విషయాల్ని పరిశీలిస్తే… మన ప్రజాస్వామ్యం ఇంత మేడిపండా అని అనిపించక మానదు.
తీవ్ర క్రిమినల్ నేరాలు – రాహుల్ వ్యాఖ్యలు ఒకటేనా ?
రాహుల్ గాంధీ ఒక్కరిపైనే కాదని.. చాలా మందిపై అనర్హతా వేటు పడిందని బీజేపీ నేతలు సమర్థించుకుంటున్నారు. కానీ వారు చెప్పినట్లు శిక్షలు పడ్డాయి కానీ అవి పరువు నష్టం కేసుల్లో కాదు. తీవ్రమైన నేరాల్లో. విక్రం సింగ్ సైనీ అనే బీజేపీ ఎమ్మెల్యేపై అనర్హతా వేటు పడింది. ఆయన యూపీకి చెందిన వారు. సొంత పార్టీ ఎమ్మెల్యేపై వేటు వేశాం అని బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ సైనీ చేసిన నేరం…. విమర్శలు కాదు. 2013 ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో దోషిగా తేలాడు. ఆ నేరానికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఆ కారణంగా ఆయన అసెంబ్లీ సభ్యత్వం రద్దు అయింది . మరి రాహుల్ చేసిన నేరం ఏమిటి ? రాజకీయ విమర్శలు. అల్లర్లకు పాల్పడటం… రాజకీయ విమర్శలు చేయడం ఒకటేనా…? సాంకేతికంగా ఎవరికి శిక్ష పడినా చట్టసభల సభ్యత్వానికి అనర్హులే . అందులో ఎలాంటి చర్చ అక్కరలేదు . కానీ , నైతికంగా వీరిద్దరినీ ఒకే గాడిన కట్టేయవచ్చా !? దేశం కోసమో , రాజకీయ పార్టీ కోసమో , వ్యవస్థ లోని లోపాల వలనో శిక్ష పడిన వారిని దొంగతనం చేసో , మానభంగాలు చేసో శిక్ష పడినవారిని ఒకే గాడిన కట్టేయవచ్చా !? . అసలు సాధ్యం కాదు. ఎందుకంటే భారత్‌లో రాజకీయ విమర్శలు ప్రజాస్వామ్య స్వేచ్చ. పరువు నష్టం కేసులో ఇంత వరకూ ఓ రాజకీయ నాయకుడికి శిక్ష పడిందే లేదు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా రాహుల్ గాంధీకే అనర్హతా వేటు వేశారు.
తీర్పు ఇచ్చిన పరిణామ క్రమం చూస్తే ఎవరికైనా అనుమానం రావడం సహజం !
రాహుల్‌పై అనర్హతా వేటు ఎందుకు పడిందంటే చాలా మంది మొదటగా అదానీని గుర్తు చేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ కూడా అదే చెబుతున్నారు. అదానీ గురించి మాట్లాడుతున్నందుకే అనర్హతా వేటు వేశారని అంటున్నారు. దేశ ప్రజలు కూడా ఎక్కువగా దీన్ని నమ్ముతున్నారు. దీనికి చాలా ఆధారాలు ఉన్నాయి. హిండెన్ బర్గ్ మొదట రిపోర్టు వచ్చింది జనవరి ఇరవై నాలుగో తేదీన. అప్పటి నుంచి రాహుల్ గాంధి ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లోనూ నిలదీస్తున్నారు. దేశవ్యాప్తంగా అదానీ అంశం హైలెట్ అవుతోంది. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే . పూర్ణేష్ మోదీ వేసిన కేసులో మొదట విచారణ జడ్జి పేరు A.N. దవే . ఈ కేసులో రాహుల్ గాంధీ 2021 జూన్ 24వ తేదీన తన స్టేట్మెంట్ ని కోర్టుకు సమర్పించారు. 2022 లో రాహుల్ ని మరోసారి వ్యక్తిగతంగా కోర్టుకు పిలిపించమని పూర్ణేష్ మోడీ జడ్జి దవే ను అభ్యర్ధించారు . జడ్జి అనుమతిని ఇవ్వలేదు .ఆ తర్వాతా సూరత్ కోర్టులో కేసు విచారణను ఆపే ఆదేశాలు ఇవ్వమని పూర్ణేష్ మోడీ హైకోర్టుకు 2022 మార్చి ఏడో తేదీన పిటిషన్ వేశారు. సూరత్ కోర్టులో విచారణను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది . ఎవరయితే కేసు వేశారో ఆయనే విచారణ నిలిపివేయాలని అడిగారు. కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే 2023 ప్రారంభంలో ఈ కేసును విచారిస్తున్న జడ్జి దవే ను బదిలీ చేసిన తర్వాత మళ్లీ విచారణపై స్టే ఎత్తి వేయాలని పూర్ణేష్ మోదీ ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన హైకోర్టులో పిటిషన్ వేశారు. అంటే ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది తేదీలను. హిండేన్ బెర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ అదానీ – మోదీ బంధాన్ని టార్గెట్ చేసిన తర్వాతనే వ్యూహాత్మకంగా జడ్జిని బదిలీ చేసిన తర్వాత మళ్లీ విచారణ కొనసాగించేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. హిండెన్ బర్గ్ – ఆదానీ రచ్చ ప్రారంభమయ్యాక రాహుల్ కేసు విచారణ పునఃప్రారంభించారు. సూరత్ కోర్టులో జడ్జి దవే స్థానంలో H.H. వర్మ అనే జడ్జిని నియమించారు. ఈ నియామకం కూడా హిండెన్ బర్గ్ – ఆదానీ – రాహుల్ రచ్చ మొదలయ్యాకనే. కొత్త జడ్జి ఆధ్వర్యంలో ఆఘమేఘాల మీద విచారణ జరిపి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఇదంతా హిండెన్ బర్గ్ రిపోర్టుకు ఆదానీకి రాహుల్ రచ్చకు రాహుల్ తీర్పుకు రాహుల్ లోకసభ సభ్యత్వం రద్దుకు లింకు ఉందని సులువుగా అర్థమయ్యేలా చేస్తుంది. దీన్ని బీజేపీ నేతలు ఎలా కాదనగలరు ?
ఓబీసీలను అన్నారంటూ ప్రచారం చేయడం మరో దివాలా రాజకీయం !
దొంగలందరి ఇంటి పేరు మోదీ అని ఎందుకందని రాహుల్ అన్నారు. కానీ ఇలా అనర్హతా వేటు వేయించిన రాహుల్ ఓబీసీలందర్నీ దొంగలన్నారంటూ కొత్త ప్రచారం ప్రారంభించారు. ఇలా కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అన్నదంటే అంత కంటే దివాలా రాజకీయం మరొకటి లేనట్లే. బీజేపీ అచ్చంగా ఇదే చేస్తోంది . బీజేపీ నేతలు సోనియా గాంధీని అత్యంత దారుణంగా కించపర్చారు. చివరికి ప్రధాని మోదీ కూడా మాటల్ని చాలా సార్లు అదుపులో పెట్టుకోలేదు. నెహ్రూ కుటుంబాన్ని కించపర్చనిదే మోదీ పార్లమెంట్ ప్రసంగం జరగదంటే అతిశయోక్తి కాదు. పార్లమెంటు సమావేశాల్లో నెహ్రూ పేరును ఉపయోగించుకోవడానికి గాంధీ కుటుంబీకులు ఎందుకు అవమానంగా భావిస్తున్నారంటూ ప్రశ్నించారు. అదే రీతిలో రాహుల్‌గాంధీ నీరవ్ మోడీ , లలిత్ మోడీ లతో మోడీని పోల్చుతూ మోడీ అని ఇంటి పేరు ఎందుకు ఉంటుందోనని వ్యాఖ్యానించారు. నెహ్రూ పేరును ఇదే మాదిరిగా గడిచి న ఆరున్నర దశాబ్దాలుగా ప్రతిపక్షాలు ఎద్దేవా చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధార ణం అయిపోయాయి. ఏదో పాసింగ్ రిమార్క్ గా రాహు ల్ మోడీ ఇంటి పే రును ఉపయోగించి ఉండవచ్చు. ఇక్క గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ నరేంద్ర మోడీ కేసు వేయలేదు. రాహుల్‌గాంధీ వ్యక్తిగత జీవితంపై బీజేపీ నాయకులు ఎన్నో ఆరోపణలు చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. అన్నిం టికీ పరువునష్టం దావాలు వేసుకుంటూ పోతే కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. అయినప్పటికీ దిగువ కోర్టులు ఇచ్చే తీర్పులపై అప్పీలు చేసుకునే అవకాశం ప్రజాస్వా మ్యం మనకు కల్పించింది.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు !
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య విలువల్ని నేతలు ఎంత కాపాడితే తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా వాటినే బెంచ్ మార్క్‌లుగా పెట్టుకుంటుంది. మిడిమాలంగా అధికారాన్ని వాడి ప్రతిపక్షాలను లేకుండా చేయాలని ప్రయత్నిస్తే.. చివరికి ప్రజలు కన్నెర్ర చేస్తారు. తర్వాత వచ్చే ప్రభుత్వాలు వీరు చేసిన అరాచకాలకు మించి చేస్తారు. దాని వల్ల నష్టపోయేది ప్రజాస్వామ్యమే.. దేశమే. ఎల్లకాలం అధికారంలో ఉండాలనేది అత్యాశ మాత్రమే. చరిత్ర చెబుతున్న సత్యం ఇదే. మరి అధికారం నెత్తికెక్కిన పాలకులకు ఇది ఎప్పుడు తెలుస్తుందో ?