తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షును బాడీ షేమింగ్ చేస్తూ బీజేపీ నేత తీన్మార్ మల్లన్న పెట్టిన పోల్ రాజకీయ దుమారం రేపుతోంది. ఈ పోల్ విషయంలో ఇప్పటికే మల్లన్నపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. కేటీఆర్ ట్విట్టర్లో జేపీ నడ్డాకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్కు సంఘిభావం చెబుతూ పలువురు ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. సోదరి కవితతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, బీఎస్పీ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సంఘిభావం తెలిపారు.
రాజకీయాలు ఎలా ఉన్నా తీన్మార్ మల్లన్న కేటీఆర్ కుమారుడ్ని రాజకీయాల్లోకి తీసుకు వచ్చి బాడీ షేమింగ్ చేయడం ఏమిటన్న అభిప్రాయం అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది.తీన్మార్ మల్లన్న పెట్టిన ఫేస్బుక్ ఫోల్ అత్యంత బాధ్యతారాహిత్యమైనదిగా ఎక్కువ మంది అభివర్ణిస్తున్నారు. అయితే అన్ని రాజకీయ పార్టీలు.. తమ విధానాల వేదికగా పోరాడకుండా కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తున్నాయని ఇలాంటి పరిస్థితి రావడానికి టీఆర్ఎస్ కూడా ఓ కారణమని మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఇటీవలి కాలంలో రాజకీయ ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీయడానికి కుటుంబసభ్యులను దారుణంగా కించ పరిచే రాజకీయం తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయింది. చంద్రబాబు భార్యపై అనుచిత వ్యాఖ్యలను వైసీపీ నేతలు చేయడంతో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ కుమారుడి వంతు. అయితే రాజకీయ గొడవలతో అప్పుడు వైసీపీ నేతల్ని సమర్థించిన వారూ ఉన్నారు. ఇప్పుడు తీన్నార్ మల్లన్నను సమర్థిస్తున్న వారూ ఉన్నారు. అందుకే రాజకీయం ఇప్పుడు దిగజారిపోయిందని నమ్మాల్సి వస్తోంది. అందరిలో మార్పు వచ్చినప్పుడే రాజకీయం మారుతుంది.