మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ ” నాథ్ ఆపరేషన్” జరుగుతుందని వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది.
మహారాష్ట్రలోని సతారాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ.. తాను ఇటీవల కర్ణాటకలో పర్యటించానన్నారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమిని కూల్చి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల కర్ణాటకకు చెందిన కొందరు నేతలు తన నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారని, వారికి తన మద్దతు ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఎలాగైతే చేశారో కర్ణాటకలో అదే తరహ రాజకీయాలు చేయాలని కొందరు తనకు చెప్పారని షిండే చేసిన వ్యాఖ్యలు కన్నడ పాలిటిక్స్ లో మరింత హీట్ పెంచాయి.
లోక్ సభ ఎన్నికల తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ పతనం అవుతుందని షిండే వ్యాఖ్యానించడంపై కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ నేతలు భ్రమల్లో,పగటి కలల్లో బతుకుతున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉందని, ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు గతేడాది నుంచి బీజేపీ కుట్రలు పన్నుతుందని అయినా, తమ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తోనే ఉన్నారని సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఏదీ ఏమైనా, బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చివేస్తామని వ్యాఖ్యానించడం చూస్తుంటే లోక్ సభ ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు అనే అనుమానాలు కలుగుతున్నాయి.