ఏడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ గురువారం నుంచి అమల్లోకి రాబోతున్న సమయంలో.. ఏపీ ప్రభుత్వం .. ప్రజలకు ఇవ్వాల్సిన తాయిలాల నిర్ణయాలన్నింటినీ తీసుకుంది. ఉదయమే ఏర్పాటు చేసిన కేబినెట్ భేటీలో… అన్నదాత సుఖీభవ..పథకం విధివిధానాలతో పాటు… జనాకర్షక పథకాలన్నింటికీ ఆమోదముద్ర వేశారు. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ గురువారం అమల్లోకి రాబోతోంది. ఈ కోడ్ అమల్లో ఉండగానే.. సార్వత్రిక ఎన్నికల నియామవళి అమల్లోకి వస్తుంది. ఈ కారణంగా.. ఇక అధికారిక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. అందుకే తీసుకోవాల్సిన నిర్ణయాలన్నింటినీ… ఏపీ కేబినెట్ తీసేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం ఇచ్చేదానితో కలిపి రూ.10వేలు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఖరీఫ్, రబీలో రెండు దఫాలుగా ఒక్కో సీజన్‌కు రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులోనే “అన్నదాత సుఖీభవ” చెక్కుల పంపిణీ, రైతు రుణ మాఫీ చెల్లింపులు కూడా చేయనున్నారు. కుటుంబానికి రూ.10వేలు ఇస్తే మొత్తంగా రూ.7,621కోట్లు ఖర్చు అవుతుందని లెక్కలు కట్టారు. అలాగే వచ్చే ఖరీఫ్ నుంచి కౌలు రైతులను కూడా ఆదుకునేలా మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించారు. కేంద్రం పథకంలో అనేక ఆంక్షలు ఉన్నాయని.. 5 ఎకరాల లోపు వారే అర్హులుగా, మూడు వాయిదాలలో చెల్లించే విధంగా, కొందరికే ఇచ్చి మిగిలిన రైతులను వదిలేసిందని, కానీ అందరికీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు, సిమ్ కార్డుతోపాటు మూడేళ్ల పాటు డేటా కూడా ఉచితంగా ఇవ్వనున్నారు. అమరావతిలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు 30 ఎకరాలు కేటాయించారు. ఎకరాకు రూ.10 లక్షల చొప్పున 30 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి విడత రూ. కోటి సీఆర్డీఏకు చెల్లిస్తే సొసైటీకి భూమి బదలాయించేలా నిర్ణయించారు. మిగతా మొత్తం రెండేళ్లలో సీఆర్డీఏకి చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. అలాగే ఎన్జీఓలు, సచివాలయ ఉద్యోగులకు 175 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ.. చదరవు గజం రూ.4 వేల చొప్పున 230 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది. ఇక ఎన్నికలకు ముందు.. ప్రజలకు పంచాల్సిన తాయిలలపై తుది నిర్ణయాలన్నీ..అయిపోయినట్లే. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా.. వీటి అమలలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు.