నారా లోకేష్ ఎక్కడికి వెళ్తున్నా సరే కనిపెట్టుకుని కాన్వాయ్ ని ఆపి సోదాలు చేయడాన్ని మంగళగిరి పోలీసులు హాబీగా పెట్టుకున్నారు. ఏమిటంటే ఎన్నికల కోడ్ అంటున్నారు. విజయవాడ, గుంటూరు, తాడేపల్లి మధ్య కొన్ని వందల మంది వీఐపీలు తిరుగుతున్నారు. కానీ ఎవరూ పోలీసుల కంటికి కనిపించడం లేదు. కేవలం ఒక్క నారా లోకేష్ కాన్వాయ్ కి మాత్రమే అడ్డం పడుతున్నారు.
లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో వివిధ వర్గాలతో సమావేశం అవుతున్నారు. అపార్టుమెంట్ల అసోసియేషన్లు, కాలనీల వారితో మాట్లాడేందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో ఆయన సమయాన్ని హరించేందుకు… పోలీసులు కుట్ర పన్నినట్లుగా వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల్లో నాలుగు సార్లు తనిఖీలు చేయడం అదీ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రచారానికి వెళ్లే సమయంలో చేస్తూండటంతో టీడీపీ వర్గాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఈ మధ్య కాలంలో వైసీపీ నేతల్ని ఒక్కర్ని కూడా తనిఖీ చేసినట్లుగా బయటపడలేదు. వైసీపీ నేతలంతా అక్కడే తిరుగుతున్నారు. కానీ ఎవరి వాహనాలు తనిఖీ చేయడం లేదు.
కామెడీ ఏమిటంటే.. ఇలా తనిఖీ లు చేసి ఏమీ లేవని పంపిస్తున్నారు. కానీ ఆ ఫోటోలు, వీడియోలతో.. నారా లోకేష్ డబ్బులతో దొరికాడని.. వాట్సాప్ గ్రూపుల్లో వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఎన్నికల కోడ్ ఒక్క లోకేష్ కే అమలు చేస్తున్నట్లుగా పోలీసుల వ్యవహారశైలి ఉండటం వివాదాస్పదంగా మారుతోంది.